logo

ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు

కాంచీపురం జిల్లా పరందూర్‌ సమీపంలో చెన్నై గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

Published : 23 Apr 2024 01:16 IST

ప్రజలతో మాట్లాడుతున్న పోలీసులు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లా పరందూర్‌ సమీపంలో చెన్నై గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పరందూర్‌ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఈనెల 19న జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఏకనాపురం ప్రజలు బహిష్కరించారు. శ్రీపెరుంబుదూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఈ గ్రామంలో 1,375 ఓట్లు ఉన్నాయి. పోలింగ్‌కేంద్రంలో 12 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీపెరుంబుదూర్‌ తహసీల్దారు సుందరమూర్తి ఏకనాపురానికి చేరుకొని గ్రామస్థులతో చర్చలు జరిపి పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఆ సమయంలో ప్రజలు, రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత గ్రామస్థులను ఓటు వేయకుండా అడ్డుకున్న ఏకనాపురం గ్రామానికి చెందిన సుబ్రమణియన్‌, కదిరేశన్‌, గణపతి, బలరామన్‌, మునుసామి, ఇలంగోవన్‌, గవాస్కర్‌, సుధాకర్‌, ఓం భగవతి, వివేకానందన్‌పై కేసు నమోదు చేశారు. సుంగువారిసత్రం పోలీసుస్టేషన్‌కు సోమవారం హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఆ మేరకు 10 మంది హాజరయ్యారు. వారి వెంట ఏకనాపురం గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌కు ఎక్కువ మంది చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకొంది. సమన్లు పొందిన వారు మాత్రమే స్టేషన్‌లో ఉండాలని హెచ్చరించడంతో మిగిలిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని