logo

విశాఖపై మత్తు పడగ!!

ఓ వైపు వాహనాల్లో భారీగా తరలివస్తున్న గంజాయి... మరో వైపు పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ద్రవ రూప గంజాయి... ఇంకో వైపు.... వందల సంఖ్యలో బయటపడుతున్న మత్తు ఇంజక్షన్లు.. ఇవి చాలవన్నట్లు... ఊహించని స్థాయిలో విశాఖ నౌకాశ్రయానికి చేరిన ‘డ్రగ్స్‌’ ఒక్కసారిగా కలకలం రేపాయి!

Updated : 22 Mar 2024 08:53 IST

భారీగా చిక్కుతున్న డ్రగ్స్‌, గంజాయి

గంజాయి ప్యాకెట్లు

ఓ వైపు వాహనాల్లో భారీగా తరలివస్తున్న గంజాయి... మరో వైపు పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ద్రవ రూప గంజాయి... ఇంకో వైపు.... వందల సంఖ్యలో బయటపడుతున్న మత్తు ఇంజక్షన్లు.. ఇవి చాలవన్నట్లు... ఊహించని స్థాయిలో విశాఖ నౌకాశ్రయానికి చేరిన ‘డ్రగ్స్‌’ ఒక్కసారిగా కలకలం రేపాయి! ప్రశాంత విశాఖ నగరాన్ని మాదకద్రవ్యాల ముఠాలు తమ అక్రమాలకు అనువైన స్థావరంగా భావిస్తున్నాయంటే ఇక్కడ నిఘాపై ఎన్నో సందేహాలు రేగుతున్నాయి!!

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: విశాఖ పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడటం.. సీబీఐ అధికారులు రంగంలోకి దగడం ఒక్కసారిగా కలకలం రేపింది. బ్రెజిల్‌ నుంచి వచ్చిన ఒక కంటైనర్‌లో దేశమే ఆశ్చర్యపోయేలా వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పకడ్బందీ భద్రత మధ్య ఆ కంటైనర్‌ విశాఖ నౌకాశ్రయంలో ఉంచారు. పూర్తిస్థాయి తనిఖీలు సాగితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశ ఉంది. ఇటీవలి కాలంలో సాగర మార్గంలో డ్రగ్స్‌ విశాఖకు రావడం ఇదే తొలిసారి. అయితే...ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల్లో వస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విశాఖ నగరాన్ని చుట్టుముట్టేశాయి. తరచూ తనిఖీల్లో బయటపడుతున్న గంజాయే దీనికి రుజువు. ఇటీవల కాలంలో దాదాపు 700 కిలోల వరకూ గంజాయి పోలీసులకు చిక్కడం గమనార్హం.  భారీ కంటైనర్‌ లారీలో తీసుకువెళ్తున్న దాదాపు 386 కిలోల గంజాయి కొద్దిరోజుల క్రితం బయటపడింది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తనిఖీ చేస్తుండగా తప్పించుకునేందుకు వేగంగా వచ్చిన లారీని వెంటాడి ఎట్టకేలకు ఆనందపురం వద్ద పట్టుకున్నారు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డ్రగ్స్‌ పట్టుకుంటే...దాని రవాణా మూలాలు విశాఖలో బయటపడుతుండటం గమనార్హం.

ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్‌

మత్తు ఇంజక్షన్లు

గోవా నుంచి దిగుమతి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట తగ్గినా...ఒడిశా నుంచి పెద్ద ఎత్తున నగరానికి దిగుమతి అవుతోంది. జాతీయ రహదారితో పాటు ఏజెన్సీ మార్గాల మీదుగా తెచ్చేస్తున్నారు. ప్రధానంగా కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, దిల్లీ, రాజస్థాన్‌, హరియాణా, బిహార్‌ వంటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు విశాఖకు వస్తున్నారు. గుట్టుగా ఇక్కడే ఉండి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి..విశాఖ తెచ్చి ..తరువాత ఆయా ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నియంత్రణకు నగర శివారులో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా.. వీటి అక్రమ రవాణా మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో గంజాయి పోలీసుల తనిఖీల్లో లభిస్తున్నా కేవలం సమాచారం ఉన్నంత వరకే వీటిని స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. సమాచారం అందని సరకు మాత్రం జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిపోతోంది.

  • గంజాయిని కొన్ని పార్సిళ్ల కేంద్రాల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తీరు ఇటీవల బయటపడింది. 
  • గోవా నుంచి రహస్యంగా డ్రగ్స్‌ తీసుకువచ్చి నగరంలో  విక్రయిస్తున్నారు. సమాచారం వచ్చిన మేరకు పోలీసులు ఆయా ముఠాలను పట్టుకుంటున్నారు. 
  • మత్తుకలిగించే ఇంజక్షన్ల విక్రయాలు కూడా నగరంలో జోరుగా సాగుతున్నాయి. ఒడిశా, కోల్‌కతాల నుంచి దిగుమతి చేసుకునియువతకు విక్రయిస్తున్నారు. బానిసలుగా మారిన వారే.. తర్వాత వ్యాపారులుగా మారి విక్రయిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు