logo

వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’

అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు.

Updated : 03 May 2024 04:39 IST

అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. ఇరుకు రోడ్లపై ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సిన రోజులు చెల్లిపోయాయని, సువిశాలంగా రహదారులు విస్తరిస్తున్నామంటూ తెగ కబుర్లు చెప్పారు.

పలుచోట్ల పనులు ప్రారంభించామని చెబుతూ కొన్ని భవనాలు పడగొట్టి ఆరంభంలో ఆర్భాటం ప్రదర్శించారు. ఆ తరవాత ఇదిగో.. అదిగో అంటూ మాటలతోనే పుణ్యకాలం పూర్తి చేశారు. మొత్తం అయిదేళ్ల పాలనా కాలంలో మొదలెట్టిన ఏ ఒక్కచోటా రహదారుల విస్తరణ పూర్తి చేయలేక అసంపూర్తిగా వదిలేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌, ఆయన అనుచర గణానికే దక్కుతుంది.

ఉత్తరాంధ్రలో పేరొందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయ రహదారిని విస్తరించాలని తెదేపా హయాంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల్లో భవనాలను తొలగించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు.


పెరుగు బజార్‌లో పెరిగిన కష్టాలు

నిలిచిన పెరుగుబజారు పనులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం అనకాపల్లిలో రహదారుల విస్తరణ విషయంలో వైకాపా సర్కారు అభాసుపాలయింది. పట్టణంలోని వ్యాపార కేంద్రాల్లో పెరుగు బజారు ముఖ్యమైనది. ఈ మార్గంలోనే అనేక కిరాణా, బంగారం, ఫ్యాన్సీ, దుస్తుల దుకాణాలు ఉన్నాయి. కానీ ఈ రోడ్డు చాలాచోట్ల 18 నుంచి 22 అడుగుల వెడల్పు ఉండేది. నాలుగు రోడ్ల కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకూ 0.6 కిలోమీటర్ల దూరం 50 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రహదారికి ఇరువైపులా 111 భవనాలు, 28 ఖాళీస్థలాలు ఉన్నాయి. తెదేపా హయాంలోనే 79 భవనాలకు పరిహారం చెల్లించారు. విస్తరణ పనులు ప్రారంభించే ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమర్‌నాథ్‌ నాలుగేళ్లు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించలేదు. నాలుగేళ్ల తర్వాత పెరుగు బజారు రహదారి విస్తరణ పనులు గతేడాది జులై 10న ప్రారంభించారు. అదైనా పూర్తి చేశారా అంటే అదీ లేదు. తనకు అనకాపల్లి టిక్కెట్‌ దక్కదని తెలుసుకున్న తరవాత అమర్‌నాథ్‌ పెరుగు బజారును గాలికొదిలేశారు. దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.


అరకులో అష్ట కష్టాలు

ఎండపల్లివలస వద్ద రహదారిపై నిలిచిన వర్షపునీరు

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రా ఊటీ అరకులోయని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో 2019లో రూ. 20 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వం కొలువుదీరింది. అంతే.. సుందరీకరణకు గ్రహణం పట్టింది. ఆర్‌ఐటీఐ నుంచి ఎండపల్లివలస వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా జరిగాయి. సుందరీకరణ మాట దేవుడెరుగు గతంలో ఉన్న వెసులుబాటు సైతం లేకుండాపోయింది. వాహనాలు పార్కింగ్‌ చేయాలో తెలియని పరిస్థితి.రహదారి పైనే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి. మరోవైపు విస్తరణ పనులు సక్రమంగా చేయకుండా వాహనాలు ‘యు’ టర్న్‌ తీసుకునే ప్రాంతాల్లో ఖాళీ తక్కువగా వదలడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. విస్తరణ పనుల్లో నాణ్యత లేని కారణంగా కోడిగెడ్డ వంతెన వద్ద నిర్మించిన రహదారి కొద్ది రోజులకే ఛిద్రంగా మారింది. దీంతో వాహనదారులు గోతుల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. మరోవైపు ఇష్టానుసారంగా పనులు చేయటంతో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది.


జగన్‌ చెప్పినా జరగదంతే!

మట్టిరోడ్డుగానే వదిలేసిన పెదబొడ్డేపల్లి-కొత్తవీధి మార్గం

‘అబీద్‌ కూడలి నుంచి పెదబొడ్డేపల్లి పెద్దమదుం వరకు నర్సీపట్నం ప్రధాన రహదారి, పెదబొడ్డేపల్లి విద్యుత్తు ఉపకేంద్రం నుంచి కొత్తవీధి మీదుగా వేంకటేశ్వర ఆలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ. 16.6 కోట్ల నిధులిచ్చాం’ 

2022 డిసెంబరు 30న నర్సీపట్నం సమీపంలోని జోగునాధునిపాలెం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివీ. నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల కాపీని ఆయన అందరికీ చూపించి ఎమ్మెల్యే గణేష్‌కు అందజేశారు.

సాక్షాత్తూ సీఎం ఇచ్చిన నిధులు కావడంతో పనులన్నీ శరవేగంతో పూర్తవుతాయని అందరూ ఆశించారు. దాదాపు 17 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.

  • అబీద్‌ కూడలి నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు మాత్రం రోడ్డు వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా కొన్ని ప్రభుత్వ భవనాలను కొంతమేర తొలగించారు. ఇరువైపులా డ్రైనేజీ కట్టి కంకర వేసి వదిలేశారు. పెదబొడ్డేపల్లి పెద్దమదుం నుంచి పాత ఎన్టీఆర్‌ కళాశాల వరకు డ్రైనేజీ మాత్రం నిర్మించారు. విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు రూ. 10.60 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశారు.
  • నర్సీపట్నం వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొత్తవీధి, పెదబొడ్డేపల్లి పెద్దచెరువు మీదుగా సబ్‌స్టేషన్‌ వద్ద చోడవరం రోడ్డును కలుపుతూ 40 అడుగుల మేర విస్తరణ పనులకు రూ. 6 కోట్లు కేటాయించారు. ఈ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. తొలుత 40 అడుగుల మేరకు విస్తరిస్తామని ఎమ్మెల్యే ప్రకటించినా ఆ తరువాత 30 అడుగులకే పరిమితం చేశారు. కొన్ని భవనాలను 30 అడుగుల మేరకు స్వచ్ఛందంగా సంక్రాంతి తరవాత తొలగిస్తామని కొందరు వ్యాపారులు ఎమ్మెల్యేకి హామీ ఇచ్చినా ఇప్పటికీ తొలగించలేదు. చెరువు వద్ద దేశనాయకుల విగ్రహాలు పెట్టినా విద్యుత్తు దీపాలు లేవు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే ఈ పనులు ముందుకు వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు.

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే


పాడేరులో ప్రణాళికను పాతిపెట్టారు

పొక్లెయిన్‌తో దుకాణాల తొలగింపు (పాత చిత్రం)

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు పట్టణ రోడ్డు సుందరీకరణలో భాగంగా ఇరువైపులా ఫుట్‌పాత్‌, మధ్యలో డివైడర్‌తో సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర 35 అడుగుల మేర విస్తరించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఐటీడీఏ అధికారులు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో పట్టణ పరిధిలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. తాత్కాలిక దుకాణాలు కోల్పోయిన ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు. ఇంతలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రంగంలోకి దిగి ఎన్నికల ముందు ఇలాంటి పనులు చేపడితే తమకు ఓట్లు పోతాయంటూ అడ్డంపడ్డారు. సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి పనులు నిలిపివేయించారు. తవ్వేసిన గుంతలు, కాల్వలతో ఏడాదిగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.


కొత్తకోటలో కొత్త తిప్పలు

విస్తరించని కొత్తకోట రహదారి

రావికమతం: భీమిలి-నర్సీపట్నం రోడ్డు అభివృద్ధిలో భాగంగా రావికమతంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు మూడేళ్లుగా ముందుకు కదల్లేదు. తొలుత 80 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించినా వ్యాపారులు అభ్యంతరం తెలపడంతో 60 అడుగులకు పరిమితం చేశారు. తొలగించాల్సిన శాశ్వత కట్టడాల్లో అధికార పార్టీకి వారివి ఉండటంతో వారంతా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణలు తొలగించకుండా నిలిపివేయించారు. దీంతో ఆక్రమణల తొలగింపు జరగక రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు