logo

రక్షకభటులపై కక్ష

ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్‌ పెద్ద టోపీయే పెట్టారు.

Updated : 03 May 2024 04:38 IST

వైకాపా పాలనలో పోలీసులకు అన్నివిధాలా అన్యాయం
వారాంతపు సెలవులు ఉత్తుత్తి హామీ
సంక్షేమ సంఘాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్‌ పెద్ద టోపీయే పెట్టారు. పార్టీ సేవకు సైతం పోలీసులను ఇష్టారాజ్యంగా వాడేసుకుంటూ వారికి ప్రభుత్వపరంగా కల్పించాల్సిన ప్రయోజనాలు పక్కనపెట్టేశారు.

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, పాడేరు/పట్టణం

ధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రక్షకభటులపై ఎక్కడలేని ప్రేమ ఒలకపోశారు. పోలీసులు ఎంతో కష్టపడుతున్నారని, వారాంతపు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది దీన్ని వినియోగించుకోవచ్చని ఆర్భాటం చేశారు. దేశంలో మొదటిసారిగా ఈ దిశగా అడుగు వేసింది తామేనంటూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. కొద్ది రోజులపాటు మాత్రం అమలు చేసి అనంతరం స్టేషన్‌లో సిబ్బంది కొరత అంటూ మానేశారు. వారాంతపు సెలవుల మాట అటుంచి, అసలు విరామం దొరకడమే గగనమైందనే పరిస్థితి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం విధినిర్వహణ సమయం బాగా పెరిగిపోయిందంటూ పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఏడు రోజులూ ఏదో ఒకచోట బందోబస్తు, స్టేషన్‌లో విధులు, రాత్రివేళలో పహారా వంటి బాధ్యతలతో నరక యాతన చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వైకాపా ప్రభుత్వ పాలనలో పోలీసులకు కొత్త చిక్కువచ్చిపడింది. ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంతో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపార వర్గాలు... ఇలా ఎవరు ఆందోళనలకు సిద్ధమైనా వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులనే ముందుకు తెస్తోంది. ఆందోళనకు సిద్ధమైన వారిని ముందస్తు అరెస్ట్‌ చేస్తోంది. ఇంకొందరిని గృహనిర్బంధాల పేరుతో ఇల్లు కదలనీయకుండా చేస్తోంది. ఇందుకోసం వెళ్లిన కానిస్టేబుళ్లు రోజంతా ఆందోళనకారుల ఇళ్ల ముందు నిలువు కాళ్లపై నుంచుని కాపలా కాయాల్సి వస్తోంది.

గతంలో పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం ఉండేది. దీనికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యవర్గం ఉండేది. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుల్‌ నుంచి సీఐ స్థాయి వరకు సంఘ సభ్యులను ఎన్నుకునేవారు. ఎన్నికైన వారు సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వీటిని నేరుగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. జగన్‌ గద్దెనెక్కినప్పటి నుంచి ఈ సంఘం ఉనికి లేకుండాపోయింది. సంఘం కార్యవర్గ ఎన్నిక సమయంలో కొందరు అనర్హులు ఉన్నారంటూ ఓడిపోయినవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీర్పు వచ్చేవరకు తాత్కాలిక కమిటీతో సంఘాన్ని నిర్వహించాలని చెప్పడంతో నాటి నుంచి నేటివరకు ఏర్పాటుచేసిన కమిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ప్రభుత్వ ఆశీస్సులున్న పోలీసు అధికారులే ఈ కమిటీపై పెత్తనం చేస్తుండటంతో గతంలోలా సభ్యులు తమ గోడు చెప్పుకొనే వీలు లేకుండాపోయింది.

ఇదేనా అండగా నిలవడం జగన్‌?

  • గతంలో విధి నిర్వహణలో ఉంటూ మృతిచెందిన పోలీస్‌ కుటుంబాలకు క్యాడర్‌తో సంబంధం లేకుండా రూ. లక్ష నగదు పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం సహాయంగా అందించేది. సంఘ సభ్యులకు కష్టకాలంలో ఈ నగదు ఎంతో ఉపయోగపడేది. జగన్‌ పాలనాపగ్గాలు చేపట్టిన 2019 నుంచి ఈ సహాయం అందించడం ఆపేశారు.
  • గత ప్రభుత్వ హయాంలో పోలీస్‌ ఆరోగ్య భద్రత కింద వైద్య ఖర్చులు రూ. 10 లక్షలు ఖర్చయినా ప్రభుత్వం భరించేది. ఈ ప్రభుత్వ హయాంలో రూ. లక్షకు మించి బిల్లులైతే తాము వైద్యం చేయమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. చేసేది లేక చేతిడబ్బులు వదిలించుకుని  ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని పలువురు పోలీసులు వాపోతున్నారు.
  • సరెండర్‌ లీవ్‌లకు గత రెండేళ్లుగా ప్రభుత్వం నగదు చెల్లించడం లేదు. విధి నిర్వహణలో భాగంగా ఏడాదికి పొడవునా సెలవులను వినియోగించుకోకుండా, సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహించినందుకు పోలీసులకు ఒక నెల జీతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు.

అల్లూరి జిల్లాలో సబ్‌ డివిజన్లు: 4 (పాడేరు, చింతపల్లి రంపచోడవరం, చింతూరు)
పోలీస్‌ స్టేషన్లు: 27
సిబ్బంది: సుమారు 1200 మంది (కానిస్టేబుల్‌ నుంచి సీఐ వరకు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని