logo

ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..

ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి.

Updated : 03 May 2024 04:40 IST

బీఎల్వోల ద్వారా ఓటర్లకు అందజేత

నక్కపల్లి కార్యాలయంలో ఓటరు స్లిప్పులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. ఆ మేరకు ఎన్నికల సంఘం అధికారులు జాబితాలను ఆర్వో కార్యాలయాలకు పంపించారు. ప్రస్తుతం వీటిని బీఎల్వోల ద్వారా గ్రామాల్లోకి పంపుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్పులను ఇచ్చేవారు కాదు. తర్వాత కాలంలో దీన్ని అమలు చేశారు. దశాబ్దం క్రితం చిన్న పేపర్లపై బీఎల్వోలు రాసి ఇచ్చేవారు. 2019 ఎన్నికల్లో మాత్రం నేరుగా ఎన్నికల సంఘమే ముద్రించిన ఓటరు స్లిప్పులు సరఫరా చేశారు. దీనిలో ఓటరు ఫొటో, వివరాలు ఓ వైపు ఉండగా, వెనుక భాగంగా వారు ఓటేసే మ్యాపింగ్‌ వివరాలు పొందుపరిచారు. ఈసారి మాత్రం ఇందులో మార్పులు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వివరం ఉన్నప్పటకీ, ఓటరు ఫొటో స్థానంలో కేవలం క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే ఉంచారు. దీన్ని స్కాన్‌ చేస్తే సదరు ఓటరు ఫొటో వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఓటరు ఫొటో మార్పు జరగకుండా చేయడానికే ఈ ఏర్పాటని వెల్లడించారు. ‘పేట’ నియోజకవర్గ పరిధిలో 292 పోలింగ్‌ కేంద్రాలుండగా, 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ సంబంధించిన ఓటరు స్లిప్పుల బండిల్స్‌ నక్కపల్లి చేరుకున్నాయి. ప్రస్తుతం వీటిని పోలింగ్‌ కేంద్రాల వారీగా బీఎల్వోలకు ఇస్తున్నారు. వీటిని ఓటర్లకు అందించనున్నారు.

నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు: బీఎల్వోలు ఓటరు స్లిప్పులను ఓటరుకుగాని, వారి కుటుంబ సభ్యులకు గాని మాత్రమే ఇవ్వాలి. ఇందులో ఓటరుకు సంబంధించిన వివరాలతోపాటు, పోలింగ్‌ కేంద్రం సమాచారం ఉంటుంది. స్లిప్పులను బయట వ్యక్తులకు ఇచ్చినా, లేక ఎక్కడైనా నిర్లక్ష్యంగా వదిలేసినట్లు గుర్తించినా కఠిన చర్యలు తీసుకుంటాం.

కె.గీతాంజలి, ఆర్వో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని