logo

ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!

పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్‌ అకౌంట్లు యాక్టివ్‌లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 03 May 2024 04:38 IST

పాడేరు యూనియన్‌ బ్యాంకు వద్ద ఎండలో ఎదురుచూస్తున్న పింఛన్‌దారులు

పాడేరు, జి.మాడుగుల, న్యూస్‌టుడే: పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్‌ అకౌంట్లు యాక్టివ్‌లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంక్‌ అకౌంట్లు యాక్టివ్‌ లేని కొంత మందితో స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ సిబ్బంది అప్లికేషన్లు నింపించి, రూ.200 చెల్లింపులు చేయించి పింఛన్లు అందజేశారు. జి.మాడుగులకు చెందిన లక్ష్మి, జి.మచ్చమ్మల సొమ్ము బ్యాంకులో పడలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే బ్యాంకు ఖాతాలో పడిందని సిబ్బంది సమాధానం చెబుతున్నారు. ఏమి చేయాలో తెలియక వారు ఇంటిబాట పట్టారు.

జి.మాడుగులలో యూనియన్‌ బ్యాంక్‌ పీవోల వద్ద పింఛను సొమ్ము తీసుకుంటున్న పింఛనుదారులు

పంపిణీలో అగ్రస్థానం: పింఛన్ల పంపిణీలో గురువారం రాష్ట్రంలో అల్లూరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయానికి ఇంటింటికీ పింఛన్ల పంపిణీలో 93.87 శాతంతో నాలుగో స్థానం, డీబీటీ విధానంలో పంపిణీలో 98.85 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. మొత్తం పంపిణీలో అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి శతశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలని ఎంపీడీఓలను కలెక్టర్‌ ఆదేశించారు.

సొమ్మసిల్లిన వృద్ధులు

పాడేరు బ్యాంకుకు భార్య సహాయంతో వచ్చిన వృద్ధుడు బోయిని అప్పారావు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా పింఛన్ల కోసం బ్యాంకులు వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాశారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడలేదని సిబ్బంది చెప్పడంతో వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 1.28 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. పలు చోట్ల వృద్ధులు ఎండకు స్పృహతప్పి పడిపోయారు. పాడేరు మండల కేంద్రంలో స్టేట్‌బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, గ్రామీణ బ్యాంకులు, సీఎస్‌పీ సెంటర్ల వద్దకు వృద్ధులు తరలివచ్చారు. కొంతమంది లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు ఫోన్‌, ఆధార్‌ నంబరు లింక్‌ కాక పింఛన్‌దారులు అవస్థలు పడ్డారు.

ఖాతాలో జమ కాలేదనడంతో నిరాశ

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ అరమపనసపుట్టు గ్రామానికి చెందిన బురిడి మహదేవ్‌ పింఛన్‌ కోసం స్థానిక యూనియన్‌ బ్యాంకును ఆశ్రయించారు. పింఛన్‌ నగదు జమ కాలేదని సంబంధిత సిబ్బంది తెలపడంతో నిరాశగా వెనుదిరిగారు. పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని సచివాలయ సిబ్బంది సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈనెల పింఛన్‌ ఎలా పొందాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు కొండలరావుకు పింఛను

పాడేరు, న్యూస్‌టుడే: ఈనెల రెండో తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట’  శీర్షికన వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమరెడ్డి కొండలరావుకు పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం పాడేరు ఎంపీడీఓ సాయి నవీన్‌ విచారణ జరిపారు. ఆధార్‌ లింక్‌ అయిన కొండలరావు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు.


సుగర్‌ మందులు వేసుకోలేదు: నాది సీహెచ్‌ఎల్‌పురం గ్రామం. పింఛను తీసుకోవడానికి ఉదయాన్నే బ్యాంకు వద్దకు వచ్చాను. ఇక్కడ చూస్తే భారీ రద్దీ ఉంది. ఎప్పుడు తీసుకుంటానో తెలియడంలేదు. షుగర్‌ మందులు వేసుకోవాలి, నిల్చోలేకపోతున్నా. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఊళ్లో అందిస్తే ఇబ్బంది లేకుండా ఉండేది. 

బండారు నూకరత్నం


బ్యాంకు బయట వేచి ఉన్న లబ్ధిదారులు

నడుం వంగిపోయినా తప్పని కష్టం.. నక్కపల్లి బ్యాంకు నుంచి బయటకు వస్తున్న వృద్ధురాలు

పింఛన్‌కోసం వచ్చి క్యూలో నలిగిపోతున్న సీతంపాలేనికి చెందిన వృద్ధులు

అనకాపల్లిలో పింఛను సొమ్ము కోసం నడవలేని స్థితిలో బ్యాంకుకు వస్తున్న వృద్ధురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని