logo

వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు

రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Updated : 23 Apr 2024 05:00 IST

మహిళలు, బాలలకు రక్షణ కరవు
దశ లేని దిశ చట్టంతో బాధితులకు నిరాశ

పెందుర్తి, పరవాడ, వేపగుంట, సబ్బవరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు మహిళల అదృశ్యం కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే వాటిని పట్టించుకునే పరిస్థితే కనిపించలేదు. మరోవైపు దిశ చట్టం చేశామని చెబుతున్న ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తీసుకురావడంలో తీవ్రంగా విఫలమైంది. పోలీసులు బలవంతంగా ప్రజలతో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడంలో చూపిన శ్రద్ధ మహిళలకు భద్రత కల్పించడంలో చూపడం లేదన్న ఆరోపణలున్నాయి.


దిక్కులేని చట్టంగా మారింది

మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కనిపించట్లేదు. దిశ చట్టం దిక్కులేనిదిగా మారింది. నగర శివారులో ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటే బాధితులు అవస్థలు పడాల్సి వస్తోంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో బాధితులను పట్టించుకోవడం లేదు.

యు.ఇందిర, జిల్లా కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం


ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు

దిశచట్టం పెట్టిందే తప్ప దానికి చట్టబద్ధత కల్పించŸలేదు. ఆడపిల్లలు, మహిళలు మీద దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని ప్రచారానికి వాడుకుంటోంది తప్ప పక్కాగా అమలు చేయలేకపోయింది.  

అట్టా సన్యాసిఅప్పారావు, ఈ.భోనంగి


వైకాపా పాలనలో అధికం

రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు, దాడులు, వరకట్న వేధింపులు అధికమవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దిశచట్టం అమలు నిమిత్తం ఎటువంటి బడ్జెట్‌ కేటాయించలేదు.

పి.మాణిక్యం, జిల్లా ఐద్వా అద్యక్షురాలు


పూర్తిస్థాయి రక్షణ లేదు

దిశ చట్టం వచ్చినా ఇంకా మహిళలకు పూర్తిస్థాయి రక్షణ లేదు. దిశ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా తగిన శిక్షలు వేయకపోవడంతో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

కావ్య, మహిళ


ఆకతాయిల చేష్టలు ఎక్కువయ్యాయి

వైకాపా పాలనలో అధికమంది గ్రామీణ ప్రాంత మహిళలు ఆకతాయిల చేష్టలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

తాటిపాముల దుర్గారావు, సబ్బవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని