logo

కూటమి వెంట జన బలం!!

కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ (దక్షిణం), పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు.

Published : 25 Apr 2024 05:30 IST

నామినేషన్లకు భారీగా రాక

ర్యాలీలో పాల్గొన్న తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, నాయకులు

కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ (దక్షిణం), పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు.

తెదేపా, జనసేన, భాజపా కూటమికి జన బలం తోడైందని. ఇదే విజయానికి చిహ్నమని పలువురు పేర్కొన్నారు.

‘దక్షిణం’ దద్దరిల్లేలా..

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ శ్రీనివాస్‌) బుధవారం నామపత్రం దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 8.30గంటలకు పూర్ణమార్కెట్‌ కూడలిలోని దుర్గాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. భాజపా, తెదేపా, జనసేన పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలి రాగా.. దుర్గాలమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీసుబ్యారెక్సు, జగదాంబకూడలి మీదుగా టర్నర్‌చౌల్ట్రీ వరకు కొనసాగింది. అనంతరం మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి వంశీకృష్ణ నామపత్రాలు అందజేశారు. తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ నజీర్‌, నాయకులు సీతంరాజు సుధాకర్‌, వంశీకృష్ణ సతీమణి చెన్నుబోయిన పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

గాజువాకలో ర్యాలీకి భారీగా హాజరైన  కూటమి శ్రేణులు

‘పశ్చిమం’లో. పండగలా..

గోపాలపట్నం, న్యూస్‌టుడే : పశ్చిమ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు (పీజీవీఆర్‌.నాయుడు- గణబాబు) బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా జ్ఞానాపురంలోని జోనల్‌ కార్యాలయానికి వెళ్లి ఆర్వో హుస్సేన్‌సాహెబ్‌కు నామపత్రాలు అందించారు. జనసేన ఇన్‌ఛార్జి ఎ.దుర్గాప్రశాంతి పాల్గొన్నారు.

గాజువాక జనసంద్రం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే:  గాజువాక నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బుధవారం నామినేషన్‌ వేశారు. వేలాది మంది కూటమి కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో భారీ ర్యాలీగా గాజువాక కుంచమాంబ ఆలయం నుంచి ఎన్నికల కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి లక్ష్మారెడ్డికి  రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, గాజువాక జనసేన ఇన్‌ఛార్జి కోన తాతారావు, భాజపా ఇన్‌ఛార్జి కరణంరెడ్డి నర్సింగరావు పాల్గొన్నారు.

పెందుర్తి... అభిమానుల జోరు

పెందుర్తి, న్యూస్‌టుడే:  పెందుర్తి నియోజకవర్గంలో కూటమి తరఫున పోటీలో నిలిచిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు నామినేషన్‌ ఘట్టం బుధవారం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గానికి చెందిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున ర్యాలీ నిర్వహించారు. వేపగుంట కూడలి నుంచి చినముషిడివాడ కూడలి వరకు వేలాది వాహనాలతో ర్యాలీ చేశారు. పంచకర్ల రమేశ్‌బాబు, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, జబర్దస్త్‌ ఫేమ్‌ హైపర్‌ ఆది ర్యాలీలో పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలోని రిటర్నింగ్‌ అధికారి పి.శేషశైలజకు మూడు సెట్ల నామపత్రాలను సమర్పించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సోదరుడు శ్రీనివాస్‌నాయుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని