logo

డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది.

Published : 29 Apr 2024 03:58 IST

 జగన్‌ బటన్‌ నొక్కినా కొంతమందికి జమకాని వైఎస్సాఆర్‌ చేయూత నిధులు
నిబంధనల పేరుతో ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గింపు

పెందుర్తి, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. ఆయా సామాజిక వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తోంది. దీని ద్వారా మహిళలు ఆదాయ వనరులను సృష్టించుకుని జీవన సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం ప్రధాన ఉద్దేశం. లక్ష్యం మంచిదే అయినప్పటికీ పథకం అమలులో లోటుపాట్లు అర్హులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులకు చేయూతను దూరం చేసింది. ఈ ఏడాది బటన్‌ నొక్కినా ఇంకా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకాలేదు.


రెండేళ్ల క్రితం ఇచ్చి రద్దు చేశారు..

నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను. నాకు రెండేళ్ల క్రితం వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని మంజూరు చేశారు. అప్పట్లో డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత వివిధ కారణాలు చెప్పి పథకాన్ని రద్దు చేశారు. ఏవో ధ్రువపత్రాలు కావాలని అడిగారు. అవి సమర్పించినా పథకం మళ్లీ రాలేదు.

జి.అప్పలకొండమ్మ, రాంపురం


ఎదురు చూస్తూనే ఉన్నారు..

అందరికీ సంక్షేమ పథకాలు అని చెప్పిన జగన్‌ కొందరికే అందిస్తున్నారు. చేయూత బటన్‌ నొక్కి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఎప్పుడు అందుతాయా అని ఎదురుచూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇంతటి ధారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.

ఎ.నాగేశ్వరరావు, ఓ లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడు


వైకాపా వర్గీయులకే..

వైకాపా ప్రభుత్వం అందరికీ పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పినప్పటికీ వాస్తవంగా పరిశీలిస్తే వైకాపాలో పలుకుబడి, ప్రాముఖ్యం ఉన్న వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే చేయూత పథకం వర్తించేలా చేస్తున్నారు. సబ్బవరం మండలంలో అరకొర నిధులు రావడంతో ముందుగా వైకాపా వర్గీయులకు మాత్రమే నిధులు జమ చేసినట్లు తెలుస్తోంది.

 కె.గోవింద, ఓ లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడు


ఇవ్వకముందే సంబరాలు..

ప్రతీ ఏటలాగే ఈ ఏడాది చేయూత డబ్బులు వస్తాయని భావించాను. అట్టహాసంగా చేయూతను అందిస్తున్నట్టు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఉత్సవాలు జరిపారు. ఇప్పటికీ అకౌంట్‌ డబ్బులు పడలేదు. ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాం. నా వైద్య ఖర్చుల కోసం అప్పు చేశాను. ఇప్పుడు దాన్ని తీర్చడం కోసం అలోచించాల్సి వస్తోంది.

శానాతి పార్వతి, బీసీకాలనీ


ఎన్నికల ముందు బటన్‌ నొక్కి..

ఈ ఏడాది ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వానికి తెలుసు. అలాంటప్పుడు చేయూత డబ్బులు బ్యాంకుల్లో ముందుగానే వేసి ఉంటే అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఎన్నికలకు నెలరోజుల ముందు ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కారు. నేటికీ డబ్బులు జమకాలేదు.

 మునగపాక అనంతలక్ష్మి


బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు..

చేయూత పథకానికి అర్హత ఉన్నా చాలామందికి ఇవ్వడం లేదు. పలువురికి కొర్రీలు పెట్టి ఆపేశారు. రెండేళ్లపాటు నాకు చేయూత ఇచ్చారు. అనంతరం ఇవ్వలేదు. జగన్‌ బటన్‌ నొక్కి నెల రోజులవుతున్నా చాలామందికి డబ్బులు పడలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులను అడిగితే సమాధానం లేదు.

 కాసులమ్మ, జీవీఎంసీ 77 వార్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని