logo

కొండలైనా.. బండలైనా.. పిండే

అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణలో భాగంగా పొలాలు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు భోగాపురం మండలంలోని లింగాలవలస, పోలిపల్లి, చెరకుపల్లి గ్రామాలకు సమీపంలో పునరావాసం కల్పించారు.

Published : 18 Apr 2024 05:16 IST

ఎన్నికల విధుల్లో యంత్రాంగం
బరి తెగిస్తున్న మైనింగ్‌ మాఫియా
న్యూస్‌టుడే, భోగాపురం

చెరకుపల్లి సమీపంలో గ్రావెల్‌ అక్రమ తరలింపు

అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణలో భాగంగా పొలాలు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు భోగాపురం మండలంలోని లింగాలవలస, పోలిపల్లి, చెరకుపల్లి గ్రామాలకు సమీపంలో పునరావాసం కల్పించారు. ఆ ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల కొండ భూములను కేటాయించగా ఇందులో కొంత భాగం మరడపాలెం, మరికొంత ముడసర్లపేట నిర్వాసితులకు ఇచ్చారు. పక్కనే స్థలాన్ని పై మూడు గ్రామాల పేదలకు జగనన్న కాలనీ కోసం కేటాయించారు. ఈ కొండ ప్రాంతంలో ఐదెకరాల మేరకు చదును చేసి లేఅవుట్‌ వేశారు. ఇదే అదునుగా పక్కనే మరో 20 ఎకరాలను జేసీబీలతో తవ్వేస్తూ.. మట్టి, కంకరను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. రాత్రి, పగటి వేళల్లో తవ్వేయడం, పెద్ద పెద్ద గుంతలు పెట్టడంతో గుట్టలు కనుమరుగైపోతున్నాయి.


న్ను పడిదంటే చాలు.. అది ఎంతటి కొండైనా ఇట్టే కరిగించేస్తున్నారు.. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దొలిచేస్తున్నారు.. స్థానిక నేతలతో ఒప్పందాలు కుదుర్చుకొని జగనన్న కాలనీ పేరుతో అక్రమ తవ్వకాలకు తెగపడుతున్నారు కొందరు కేటుగాళ్లు. భోగాపురం మండలంలో ఈ పరిస్థితి ఎక్కడికక్కడే కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం నిమగ్నమై ఉండడంతో అడిగేవారు లేక మైనింగ్‌ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

పోలిపల్లి రెవెన్యూలో జగనన్న కాలనీకి ఆనుకుని తవ్వకాలు

నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో దందా సాగుతుండడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అన్నీ మేం చూసుకుంటామంటున్న స్థానిక నాయకులు, ముందుగానే పెద్దల నుంచి పోలీసులు, రెవెన్యూ, నిఘా వర్గాలకు ఫోన్‌ చేయిస్తున్నారు. ఎవరికైనా మట్టి, కంకర అవసరమైతే మైనింగు మాఫియా రంగంలోకి దిగుతోంది. ప్రభుత్వ అవసరాలకంటూ కొండలపై వాలిపోతోంది. తవ్వకాల నుంచి సరఫరా వరకు బాధ్యత తీసుకుంటోంది. ఇందుకు అవసరార్థుల నుంచి రూ.లక్షల్లో గుంజుతోంది. యంత్రాలు, రవాణా ఖర్చులు పోనూ.. స్థానికులకు కొంత మొత్తం ఇస్తూ మిగిలిందంతా మింగేస్తోంది. పలుచోట్ల చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తోడి ప్రైవేటు లేఅవుట్లకు తరలిస్తోంది.

ముడసర్లపేట నిర్వాసిత కాలనీకి వెళ్లే దారిలో..


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

ఎక్కడైనా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు చేపడితే ముందస్తుగా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘిస్తే వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలను పరిశీలించి, అవసరమైతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం.

శ్యాంకుమార్‌, తహసీల్దారు, భోగాపురం

ఎ.రవికుమార్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని