logo

జగన్‌ ‘మిత్ర’ ద్రోహం

‘జగన్‌ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికలైన తర్వాత మరోలా.. ఉండేవాడు కాదు. మీ బిడ్డకు నిజాయతీ ఉంది.

Updated : 01 May 2024 04:51 IST

 వైకాపా రాగానే కల్యాణ, బీమా మిత్రల నిలుపుదల
 వీవోఏలు, యానిమేటర్లకు నిబంధనలతో ఒత్తిడి

హామీ: ‘నేను ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం కల్యాణ మిత్రలుగా మీరే ఉంటారు. పెళ్లిళ్లు నిర్వహిస్తారు. పగలు జరిగే పెళ్లికి ఇచ్చే రూ.250 ప్రోత్సాహకాన్ని రూ.500కు, రాత్రి జరిగే పెళ్లి మొత్తాన్ని రూ.1,000కి, క్షేత్రస్థాయి తనిఖీకి వెళితే ఇచ్చే రూ.300ను రూ.600కు పెంచుతాం’. - 2019 జులై 5వ తేదీన తనను కలిసిన కల్యాణ మిత్రలకు సీఎంగా జగన్‌ ఇచ్చిన హామీ.

అదే ఏడాది జులై 2న ముఖ్యమంత్రి జగన్‌ బీమా మిత్రలకూ హామీ ఇచ్చారు. గౌరవ వేతనం కింద ప్రతి నెలా రూ.3వేలు ఇస్తామని, క్లెయిమ్‌ అప్‌లోడు చేసిన వెంటనే రూ.1,000 ప్రోత్సాహకాన్ని అందిస్తామని చెప్పారు.

 అమలు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్యాణ మిత్రలు, బీమా మిత్రలను నిలుపుదల చేసింది.

 న్యూస్‌టుడే, విజయనగరం మయూరి కూడలి

‘జగన్‌ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికలైన తర్వాత మరోలా.. ఉండేవాడు కాదు. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. నిబద్ధత ఉంది. చెప్పాడంటే చేస్తాడంతే..’ అని అక్కాచెల్లెళ్లకు ఊకదంపుడు మాటలు చెప్పిన జగన్‌ వారికిచ్చిన హామీలు నెరవేర్చకపోగా, కొత్త సమస్యలు సృష్టించారు.

పూర్తిగా మోసం

అక్కాచెల్లెమ్మలంటూ పాదయాత్రలో ఊరూరా తిరిగి, తలపై చేతులు పెట్టి, బుగ్గల నిమిరిన జగనన్న అధికారంలోకి రాగానే వారి ఉపాధికే ఎసరు పెట్టారు. గత ప్రభుత్వం హయాంలో క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాల్లో కాస్తా చదువుకొని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని కల్యాణ మిత్రలు, బీమా మిత్రలుగా ఎంపిక చేశారు. వీరంతా చంద్రన్న పెళ్లికానుక, బీమా వంటి పథకాల్లో పనిచేసేవారు. అప్పటి పథకాల్ని పేరు మార్చి(వైఎస్సార్‌ పెళ్లికానుక, వైఎస్సార్‌ బీమా) అమలు చేస్తున్నా.. అందులో సేవలు అందించిన వారిని మాత్రం తొలగించారు. అప్పట్లో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించుకునేవారు.. ప్రస్తుతం ఉపాధి లేక వ్యవసాయం, ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాలను ఈడ్చుకుంటూ వస్తున్నారు.

గతంలో పెళ్లి కానుక పథకంలో వధూవరులకు కల్యాణ పథకంలో వివాహ ధ్రువపత్రం ఇస్తున్న కల్యాణ మిత్ర

ఇది పరిస్థితి

ఏ ప్రభుత్వం వచ్చినా.. కొత్త ఉద్యోగాలు తీయడం, ఉన్నవారికి మంచి జీతాలు, గౌరవ వేతనం ఇవ్వడం వంటివి చేయాలి.. కానీ రాష్ట్రంలో 2019లో వైకాపా సర్కార్‌ కొలువు దీరిన తర్వాత చిరు ఉద్యోగులు, పథకాల్లో పని చేసేవారికి ఉపాధి లేకుండా చేసింది. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారికి అప్పట్లో ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదు. ఇది ఎక్కడి న్యాయమని మహిళలంతా ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వం చంద్రన్న బీమా పథకంలో మరణించిన, వివిధ ప్రమాదాల్లో అంగవైకల్యం జరిగిన వ్యక్తుల క్లెయిమ్స్‌ (అన్ని రకాల ధ్రువపత్రాలు) క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి సేకరించి జిల్లా కేంద్రంలో ఉన్న బీమా సెంటర్‌కు అందజేయడం, వాటిని అప్‌లోడ్‌ చేసి క్లెయిమ్స్‌ వచ్చే విధంగా కృషి చేయడంలో ఉమ్మడి జిల్లాలో బీమా మిత్రలే కీలకం. 2019 నాటికి ఉమ్మడి జిల్లాలో ప్రతి మండలానికి 3-4 మంది ఉండేవారు. మొత్తం 110 మంది వరకు ఉండేవారు. వీరికి ఏడాదిపాటు ఇవ్వాల్సిన కమిషన్‌ (అప్‌లోడుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకం) రూ.లక్షలో ఉంది. అదేవిధంగా కల్యాణ పథకం కోసం ఉమ్మడి జిల్లాలో 120 మందిని నియమించారు. వీరికి కూడా ప్రోత్సాహకం రూ.లక్షలోనే రావాల్సి ఉంది.

ఎన్నో నిబంధనలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి స్వయం సంఘాలకు చెందిన మహిళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిలో కొంత మందిని గ్రామ సంఘ సహాయకులు (వీవోఏ)గా, పట్టణ సంఘాల్లో యానిమేటర్లు(రిసోర్స్‌ పర్సన్లగా) నియమించారు. వీరు గ్రామంలో ఉన్న సంఘాలను ఒకే యూనిట్‌గా సంఘం పేరిట చేశారు. ఆ సంఘానికి వీరిని నియమించి సంక్షేమ పథకాలను (బ్యాంకు లికేంజీ, స్త్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి, ఉన్నతి) తదితర వాటిని మహిళలకు ఇవ్వడం, వారి నుంచి రుణాలను వసూలు చేయడం చేస్తారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 1,475 మంది ఉండేవారు. అయితే 2021 తర్వాత వైకాపా సర్కార్‌ కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. వీవోఏల పరిధిలోకి వచ్చే సరికి 15 కంటే తక్కువ డ్వాక్రా సంఘాలుంటే వాటిని ఎక్కువ సంఘాలు ఉండే గ్రామ సంఘాల్లోకి విలీనం చేశారు. దీంతో అప్పట్లో 100 మంది వరకు కొలువులు కోల్పోయారు.  

రూ.కోట్లలో బకాయిలు

పట్టణాల్లో రిసోర్స్‌పర్సన్ల(ఆర్పీ)ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వీరికి మూడేళ్ల కాల పరిమితితో పాటు 45 ఏళ్లు నిండితే తొలగింపు నిబంధన పెట్టారు. దీన్ని అమలు చేస్తూ, ఎక్కడికక్కడే ఆర్పీలను తొలగించేశారు. వీరికి నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు గౌరవ వేతనం గత ప్రభుత్వం ఇచ్చేది. అప్పట్లో వీరిని చిరుద్యోగులుగా గుర్తించింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 1,300 మంది ఆర్పీలు ఉన్నట్లు సమాచారం. వీరికి గతేడాది డిసెంబరు నుంచి వేతనాలు కూడా ఇవ్వలేదు. ఈ మేరకు నెలకు రూ.1.30 కోట్లు చొప్పున ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్లు వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తితో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా.. డిసెంబరు వరకు ఇటీవల వీవోఏలకు వేతనాలు జమచేశామని, మిగిలిన వాటికి బడ్జెట్‌ రావాల్సి ఉందని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని