logo

ఓ వినాశకారి.. ఈ వారధులు చూడోసారి

ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది..

Published : 01 May 2024 03:51 IST

మృత్యుదారిలా వంగర, వింధ్యవాసి సమీపంలోని పోతల గెడ్డపై ఉన్న వంతెన

ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది.. అడుగు రోడ్డు కూడా వేయలేకపోయింది.. అలాంటిది వంతెనలు నిర్మిస్తుందా.. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఒక్క వారధి కూడా పూర్తికాలేదు.. ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకునేందుకు సారు గారూ మాత్రం విమానాలు, బస్సులలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు.. కాస్త దిగి తమ కష్టాలు చూడాలని ప్రజలు కోరుతున్నారు..  ఏం చేశారని బుధవారం బొబ్బిలికి వస్తున్నారని నిలదీస్తున్నారు.

 న్యూస్‌టుడే, దత్తిరాజేరు


ఉమ్మడి జిల్లాకు కీలకం

ఉమ్మడి జిల్లాలో కీలకమైన పారాది వంతెన తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే కొంతమేర కుంగిపోయింది. నూతన నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరు చేశారు. రెండేళ్లయినా పనులు ప్రారంభించలేదు. పాత వంతెనపై వాహనాలు నిషేధించారు. కాజ్‌వే మీదుగానే రాకపోకలు సాగుతున్నాయి. రూ.90 లక్షలు వెచ్చించి నిర్మించిన అనుసంధాన రహదారి రెండు నెలలకే పాడైపోయింది. నీరు ప్రవహిస్తే మరింత కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది.  

న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం


నిధుల్లేక ఇలా వదిలేశారు..

సంతకవిటి మండలంలోని వాల్తేరు, శ్రీకాకుళం జిల్లా ఆమదావలస మండలం ఇసుకలపేట గ్రామాల వంతెన నిర్మాణం ఏళ్లుగా సాగుతోంది. రూ.87 కోట్లతో 2023లో పనులు చేపట్టారు. 18 నెలల్లో పూర్తి చేయాలి. ఇప్పటివరకు రూ.12 కోట్ల విలువైన పనులు చేసినట్లు గుత్తేదారు చెబుతున్నారు. నిధులు మంజూరు కాక ఇలా మధ్యలోనే వదిలేశారు. రెండు జిల్లాల్లోని 40 గ్రామాల వారు నాగావళి నాది దాటేందుకు ఇదే దిక్కు.

 న్యూస్‌టుడే, సంతకవిటి


పొంచి ఉన్న ప్రమాదం..

శృంగవరపుకోట మండలం ధర్మవరం రోడ్డులోని పోతనాపల్లి కూడలి వద్దగల నిర్మాణం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇప్పటికే రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఇటీవల అధికారులు వెళ్లి పరిశీలించగా.. కిందభాగంలో పిల్లర్లు సైతం కూలే స్థితికి చేరినట్లు గుర్తించారు. స్తంభాలకు రక్షణగా ఉన్న రాతికట్ట కూడా కొట్టుకుపోయింది. స్థానికంగా ఉన్న గెడ్డలో నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదు. ఇటుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రూ.4.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా నిధులకు దిక్కులేదు.

 న్యూస్‌టుడే, ఎస్‌.కోట


అరకొర మరమ్మతులతో సరి

విజయనగరం నుంచి భీమసింగి, కొత్తవలస మీదుగా విశాఖ వెళ్లే మార్గంలో అలమండ గెడ్డ వద్ద నిర్మించిన వంతెన అధ్వానంగా దర్శనమిస్తోంది. ఇక్కడ బ్రిటిష్‌ కాలంనాటి పురాతన నిర్మాణం ఇంకా వినియోగంలో ఉంది. ప్రమాదకరంగా మారిందని సంబంధిత అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే వేరే దారిలేక వాహనదారులు వినియోగిస్తున్నారు. ఇప్పటికే స్లాబ్‌ దెబ్బతింది. హ్యాంగర్‌లు విరిగిపోయాయి. జడ్పీ నిధులు రూ.20 లక్షలతో అరకొరగా మరమ్మతులు చేసి వదిలేశారు. అధికారులు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా నిధులు రాలేదు.

 న్యూస్‌టుడే, జామి


అయిదేళ్లుగా ఊరిస్తోంది

కొత్తవలస మండలం మంగళపాలేనికి సమీపంలో మేఘాద్రిగెడ్డపై వారధి నిర్మాణ పనులు అయిదేళ్ల నుంచి పూర్తి కాలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇక్కడ వంతెనతో పాటు బీటీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు రూ.కోటి కేటాయించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు మొదలు పెట్టారు. కానీ పూర్తిచేయలేకపోయారు. బిల్లులు చెల్లింపులు జరగక గుత్తేదారు ఆపేశారు. ఇది పూర్తయితే ఎం.ఆర్‌.పురం, చీపురువలస, గులివిందాడ, గనిశెట్టిపాలెం, దెందేరు తదితర గ్రామాల వారు విశాఖ వెళ్లేందుకు కొత్తవలస రావాల్సిన అవసరం లేకుండా మంగళపాలెం మీదుగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుంది.

 న్యూస్‌టుడే, కొత్తవలస


16 గ్రామాల వారికి ఉపయోగం

సంతకవిటి మండలంలోని మల్లయ్యపేట- హొంజరాం రహదారిలో నారాయణపురం కుడి ప్రధాన కాలువపై ఉన్న వంతెన దుస్థితి ఇది. దాదాపు 16 గ్రామాలవారు ఉపయోగించే దీనిని ఒక్క నాయకుడూ పట్టించుకోలేదు. ఎప్పుడు కూలిపోతుందోనని అంతా భయాందోళన చెందుతున్నారు.


తిశ్రీపాలకులూ కాస్త చూడండి

మెంటాడ మండలం కొంపంగి సమీపంలోని వంతెన శిథిలావస్థకు చేరింది. రెండు వైపులా రైయిలింగ్‌లు దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో కూనేటి గెడ్డ దీని కింద నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కోసారి పైనుంచి పారుతుంది. ఈ సమయంలో రాకపోకలు స్తంభిస్తున్నాయి. 20 గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వంతెన నిర్మించాల్సి ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు.

 న్యూస్‌టుడే, మెంటాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు