logo

ప్రతిపక్షాలపై కక్ష.. పండుటాకులకు శిక్ష

పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.

Published : 01 May 2024 03:46 IST

పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. గత నెలలో సచివాలయాల్లో నగదు అందజేసింది. ఈ నెలకు సంబంధించిన నగదును బ్యాంకుల్లో వేస్తామని ప్రకటించింది. దీంతో నగదు బదిలీ కాక ముందే లబ్ధిదారులు ఆపసోపాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేయలేమని, ఇంటి వద్దే అందజేయాలని వారు కోరుతున్నారు.

ఈనాడు, విజయనగరం

విజయనగరం జిల్లాలో 2,82,903 మంది పింఛనుదారులు ఉన్నారు. వారికి రూ.82.66 కోట్లు పంపిణీ చేయాలి. ఇందులో ఇంటికి వెళ్లి అందజేయాల్సిన వారిలో 68,944 మందిగా గుర్తించారు. వీరిలో దివ్యాంగులు, రోగులు, సైనిక పింఛనుదారులు 40,100 మంది. 20,844 మందికి బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేవు. వీరి ఆధార్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై లేవు.

జిల్లాలోని ప్రతి మండలంలో 6-10 వేల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. సగటున ఒక్కో మండలంలో నాలుగైదు బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఒక్కో బ్రాంచిలో రోజుకు వంద మందికి మాత్రమే నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది. పెద్ద బ్రాంచి అయితే గరిష్ఠంగా రెండొందల మందికి ఇవ్వగలరు. ఈ లెక్కన అందరికీ నగదు ఇవ్వాలంటే కనీసం వారం  పడుతుంది. ఒక్క రోజులో జరిగే పనిని వారం కొనసాగేలా.. ఆపై బ్యాంకుల చుట్టూ మండుటెండలో తిరిగేలా ప్రభుత్వ నిర్ణయం ఉండటంపై లబ్ధిదారులు మండిపోతున్నారు.

 ఖాతాలు ఉన్నా వాటిని సక్రమంగా నిర్వహించని వారు మరో రెండు శాతంగా లెక్కిస్తే సుమారు పది వేల మంది వరకు ఉంటారు. వారికి ఒకటో తేదీన నగదు బదిలీ కాకపోతే మూడు రోజుల తర్వాత ఆ మొత్తాన్ని డ్రా చేసి వారింటి వద్దే అందజేయాల్సి ఉంది.
జిల్లాలో ఇంటింటికీ 68,944 మందికి రూ.18.47 కోట్లు ఇవ్వాలి. ఈ మొత్తం మంగళవారమే సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయాలని చూశారు.

ఒకటో తేదీన లేనట్లే..

మే డే సందర్భంగా బుధవారం బ్యాంకులకు సెలవు. సిస్టమ్‌ జనరేటెడ్‌ విధానం వల్ల పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమవుతుందని అధికారులు చెబుతున్నా ఎలా చూసుకోవాలో తెలియదు. మొత్తం పింఛనుదారుల్లో ఏటీఎం కార్డులు ఉన్న వారు రెండు శాతం మంది మాత్రమే. పైగా వారు ఏటీఎంకి వెళ్లాలంటే వ్యయప్రయాసలకు గురి కావాల్సిందే. వీరికి దీని వినియోగంపై అవగాహన ఉండదు.

ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు

మే 2వ తేదీ నుంచి బ్యాంకుల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. అక్కడికి వచ్చే వారికి నీడ, నీటి వసతి కల్పించాలని, కుర్చీలు బల్లలు వేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆదేశించింది. అయిదు పది మంది వరకు ఉంటే వారికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. వందల సంఖ్యలో వస్తే వారు చేతులెత్తేసే పరిస్థితి. బ్యాంకుల్లో సిబ్బందిని పెంచాలని, హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉన్నఫళంగా సిబ్బందిని పెంచే అవకాశం లేదంటున్నారు.

2.13 లక్షల మంది.. 280 బ్యాంకులు

విజయనగరం జిల్లాలోని బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యే పింఛనుదారులు 2,13,959 మంది ఉన్నారు. వీరికి జిల్లాలోని సుమారు 280 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి.

ఎస్‌.కోట నియోజకవర్గంలో గిరిశిఖర దారపర్తి పంచాయతీలోని సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు బ్యాంకుకు రావాలంటే 14 కి.మీ. దూరం కాలినడకన పట్టణానికి చేరుకోవాలి. దబ్బగుంట గ్రామం నుంచి పల్లపుదుంగాడకు వెళ్లే రోడ్డు ఇది. ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నిధులు సుమారు రూ.4 కోట్ల మంజూరైనా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పింఛనుదారులు వచ్చేందుకు భయపడుతున్నారు.


బ్యాంకుకు వెళ్లాలని తెలియదు

పింఛను ఇంటి దగ్గర ఇస్తారనుకుంటున్నాను. బ్యాంకులకు వెళ్లాలని తెలియదు. నాకు తెర్లాంలోని రెండు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. దేనిలో పింఛను డబ్బులు పడతాయో తెలియదు. ఎండల సమయంలో మాలాంటి వాళ్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెర్లాంలోని బ్యాంకులకు వెళ్లాలి. అక్కడ ఎంతమంది నాలాంటి వాళ్లు ఉంటారో చూడాలి.

 భూపతి అప్పలస్వామి, చిన్నయ్యపేట, తెర్లాం


  •  గజపతినగరం మండలంలో 8,620 మంది పింఛనుదారులు ఉన్నారు. అయిదు బ్యాంకులు ఉన్నాయి. శివారున ఉన్న వేమలి గ్రామ పింఛనుదారులు శ్రీరంగరాజపురం యూనియన్‌ బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవాలి. ఈ బ్రాంచిలో అయిదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడికి ఈ మండల వాసులతో పాటు దత్తిరాజేరు మండలంలోని ఆరు గ్రామాల వారు వస్తారు. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరూ పది కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవాలి. అందరూ ఆటోల్లో రావాల్సి ఉంటుంది. రెండు వైపులా ఒక్కొక్కరికి రానుపోను రూ.100 ఖర్చవుతుంది. ఆపై ఎవరైనా తోడు వస్తే వారికి కూడా అదనం. ఆ గ్రామంలో మధ్యాహ్నం భోజనం దొరకదు.  

    10 కి.మీ వెళ్లాల్సి ఉంది

ఇంటికి తెచ్చి ఇచ్చే పింఛను కాస్తా గత నెలలో సచివాలయాల్లో పంపిణీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు వేస్తున్నారు. మాది సింగరాయి గ్రామం. 72 ఏళ్ల వయసులో ఎండలో 10 కి.మీ. దూరంలోని వేపాడ బ్యాంకుకు వెళ్లి సొమ్ము ఎలా తీసుకోవాలి. మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది.

 రిక్కి అప్పారావు, సింగరాయి


  •  బ్యాంకు ఖాతాలు ఉన్నా కేవైసీ చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. వారంతా బ్యాంకుకు వచ్చినా కేవైసీ చేసుకోవాలంటే ఈ రద్దీలో కుదరదు. అలాంటి వారందరికీ మళ్లీ రమ్మని బ్యాంకు సిబ్బంది చెప్పే అవకాశం ఉంది.
  •  నూతనంగా ఖాతాలు తెరవాలన్నా ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. నూతనంగా దరఖాస్తు పూరించి ఇస్తే బ్యాంకు సిబ్బంది మూడు రోజుల్లో ఖాతా తెరుస్తామని చెబుతారు.

    వెళ్లాలంటే భయమే..

ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తామంటోంది. మాకు బ్యాంకు 12 కి.మీ. దూరంలో ఉంది. బ్యాంకుల్లో తరచూ సాంకేతిక లోపం ఉందని చెబుతుంటారు. తీరా అక్కడికి వెళ్లాక డబ్బు ఇవ్వకపోతే ఇబ్బందే. ఎప్పటిలాగే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వచ్చి అందజేసేలా చర్యలు తీసుకోవాలి.  

- ఆబోతుల లక్ష్మణ, వృద్ధాప్య పింఛనుదారుడు, ఏటీ అగ్రహారం


నాకు శస్త్రచికిత్స జరిగింది

ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో బొబ్బిలి బ్యాంకుకు వెళ్లి సొమ్ము తెచ్చుకోవాలంటే చాలా కష్టం. నాకు కడుపు కింద ఆపరేషన్‌ జరిగింది. వాహనాల్లో ప్రయాణం చేయలేను. గత నెలలో ఇంటికి పింఛను ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.

 పిరిడి శివుడు, కలవరాయి, బొబ్బిలి మండలం


ఇంటి దగ్గరే ఇవ్వాలి

ప్రతి నెలా ఇస్తున్నట్లే పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వాలి. గత నెలలో సచివాలయానికి వెళ్లి తీసుకోవడంతో ఆలస్యమైంది. ప్రభుత్వం మళ్లీ ఈ నెల బ్యాంకుల నుంచి తీసుకోవాలంటే ఇబ్బంది తప్పేలా లేదు. బ్యాంకుకు వెళ్లి రావాలంటే ఎండలో ఇబ్బందితో పాటు, రానుపోను రూ.40 రవాణా ఖర్చు అవుతుంది.

  మజ్జి లక్ష్మి, అయ్యన్నపేట, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని