logo

అవ్వాతాతలతో.. సర్కార్‌ పింఛనాట!

వృద్ధులతో వైకాపా సర్కార్‌ పింఛనాట ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందించే వెసులుబాటు ఉన్నా.. పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

Published : 01 May 2024 04:05 IST

 పింఛను ఇంటి వద్దే ఇవ్వాలని వృద్ధుల విన్నపం
ఎండలో బ్యాంకులకు వెళ్లలేమని ఆవేదన

వృద్ధులతో వైకాపా సర్కార్‌ పింఛనాట ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందించే వెసులుబాటు ఉన్నా.. పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీన్ని ప్రతిపక్షాలపై నెట్టి, లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోంది. బ్యాంకుల ఖాతాలో సొమ్ము వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అవ్వాతాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వేసవిలో బ్యాంకులకు ఎలా వెళ్లాలని కొందరు, ఖాతాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదని మరికొందరు వాపోతున్నారు.

 న్యూస్‌టుడే,  గజపతినగరం, తెర్లాం, బొబ్బిలి

బొబ్బిలి పట్టణం, మండలంలో 17,438 మంది పింఛనుదారులు, బాడంగిలో 8,628, తెర్లాంలో 9,849, రామభద్రపురంలో 11,021 మంది ఉన్నారు. వీరందరికీ రూ.140,808,000 సొమ్ము చేరాల్సి ఉంది. నియోజకవర్గంలో సుమారు 450 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా చొరవ తీసుకుని 100 మందికి చొప్పున అందిస్తే సరిపోతుంది.


ఖాతా ఏ బ్యాంకులో ఉందో

గత నెల కుటుంబ సభ్యుల తోడుతో సచివాలయానికి వెళ్లి, డబ్బులు తీసుకున్నా. ఈసారి బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలని తెలియదు. నాకు ఏ బ్యాంకులో ఖాతా ఉందో కూడా గుర్తులేదు. పుస్తకాన్ని కూడా వెతుక్కోవాలి. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇల్లు దాటాలంటే భయంగా ఉంది. ఫింఛను సొమ్ము ఖాతా నుంచి తీయాలంటే ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడాలో.

లోగిశ కురమమ్మ, చిన్నయ్యపేట


ఏళ్లు అవుతోంది

నాకు గజపతినగరం బ్యాంకులో ఖాతా ఉంది. లావాదేవీలు జరిపి ఏళ్లు అవుతోంది. పుస్తకం ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు వెతుక్కోవాలి. అక్కడికి వెళ్తే.. గంటల కొద్దీ వేచి ఉండాలి. లేకపోతే మరోరోజు రమ్మంటారు. ఎందుకు ఇలా తిప్పలు పెడుతున్నారు.

రాయి రాము, గంగచోళ్లపెంట


సరైన పద్ధతి కాదు

నా వయస్సు 62 సంవత్సరాలు. మండుతున్న ఎండలతో ఇంటి నుంచి బయటికి రాలేకున్నా. గతనెల పింఛను తీసుకోవడానికి కుక్క పాట్లు పడ్డాం. సచివాలయాల చుట్టూ రెండు రోజులు తిరగాల్సి వచ్చింది. అలాకాకుండా నేరుగా ఇంటికే తెచ్చి ఇవ్వాలి. బ్యాంకు ఖాతాల్లో వేస్తే మేము వెళ్లి తీసుకోలేము. ఇలాంటి తరుణంలో ఇది సరైన పద్ధతి కాదు. ఉద్యోగులు వచ్చి పింఛను ఇవ్వాలి. ప్రభుత్వం దీని గురించి మరోసారి ఆలోచించాలి.

తలారి శ్యామరావు, బొబ్బిలి పట్టణం


రద్దీగా ఉంటుంది

ఇంటి వద్ద పింఛను ఇవ్వొద్దన్నారు. కనీసం గత నెలలా సచివాలయంలో ఇచ్చినా బాగుండేది. నాకు జీరో ఖాతా ఉంది. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవడం కష్టమే. అన్ని గ్రామాల నుంచి వస్తారు. రద్దీ పెరుగుతుంది. పాత విధానంలో ఇస్తే మేలు.

సంబాన కామరాజు, పురిటిపెంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని