logo

నేనున్నానన్నావ్‌.. బొబ్బిలిని వదిలేశావ్‌

అబద్ధపు హామీలు.. కపట ప్రేమ కురిపించి.. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టారు.

Updated : 01 May 2024 04:52 IST

ఐదేళ్లు చాలలేదా జగన్‌..!! 

బాడంగి సీహెచ్‌సీ వరండాలో రోగులకు సేవలు

ఈ హామీలు ఏమయ్యాయి

  •  2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో బొబ్బిలి నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ పారిశ్రామికవాడపై హామీలు ఇచ్చారు. పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 
  •  తనకు అవకాశం ఇస్తే పారిశ్రామికవాడను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కూడా భరోసా ఇచ్చారు.
  •  బాడంగి మండలం గొల్లాది వద్ద వేగావతిపై వంతెన నిర్మిస్తామని మంత్రి బొత్స, ఎమ్మెల్యే శంబంగి మాటిచ్చారు. వంతెన పూర్తయ్యాక మీ ఊరిలో రాత్రి బస చేసి వెళ్తామని కూడా చెప్పారు.
  •  బొబ్బిలి మండలం రాముడువలస, తెర్లాం మండలం లోచర్ల వద్ద ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శంబంగి చెప్పుకొచ్చారు.

బొబ్బిలి, న్యూస్‌టుడే

అబద్ధపు హామీలు.. కపట ప్రేమ కురిపించి.. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టారు. ఒక్క హామీ నెరవేర్చకపోగా కొత్త సమస్యల్ని తీసుకొచ్చారు. బొబ్బిలి నియోజకవర్గంలో ఐదేళ్ల పాలనలో ఒక్క శాశ్వత అభివృద్ధి పనీ జరగలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. వంతెనలు అటకెక్కాయి. సాగునీటి రంగం చతికిలపడింది. వైకాపా నేతల మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది.

సీహెచ్‌సీల్లో అవస్థలు

బాడంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రూ.8 కోట్ల నిధులు కేటాయించారు. నాలుగేళ్ల కిందట పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 30 పడకల నుంచి 50 స్థాయికి పెంచి పనులు చేపట్టారు. రోజుకు ఓపీ 150 నుంచి 200 ఉంటోంది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాత భవనంలోనే సేవలు అందిస్తున్నారు. వసతి లేక వరండాలో మంచాలు వేసి, రోగులకు సేవలు అందిస్తున్నారు. బొబ్బిలి సామాజిక ఆసుపత్రి పేరుకు 50 పడకలు కానీ 30 మంచాలు మాత్రమే ఉన్నాయి. సుమారు రూ.కోటిన్నర అంచనా వ్యయంతో కొత్త భవనం నిర్మించారు. వార్డులు మాత్రం నిర్మించలేదు.

  వేల ఎకరాలు  సస్యశ్యామలం అయ్యేవి!

బొబ్బిలి మండలం రాముడువలస, తెర్లాం మండలం లోచర్ల వద్ద ఎత్తిపోతల పథకాలకు గత ప్రభుత్వం హయాంలోనే భూమిపూజ జరిగింది. ఐదేళ్లు అవుతున్నా వాటికి కదలిక లేదు. ఈ రెండు పూర్తయితే సుమారు 1,500 ఎకరాల మెట్ట భూములు సాగులోకి వచ్చేవి. తోటపల్లి మిగులు జలాల పనులకు మూడేళ్ల కిందట రూ.60 కోట్లతో భూమిపూజ చేసినా ఇంతవరకు పూర్తి కాలేదు. బొబ్బిలి మండలం నారాయణప్పవలస వద్ద కంచరగెడ్డ జలాశయం 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయింది. రామభద్రపురం మండలం ఏడొంపుల గెడ్డ నుంచి సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. వీటి ఆధునికీకరణ పనులు గాలికి వదిలేశారు.


రోడ్డున పడ్డ 2,500 మంది కార్మికులు

పారిశ్రామికవాడలో రోడ్ల దుస్థితి ఇది

ఐదేళ్లలో పారిశ్రామికవాడకు ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఫెర్రో అల్లాయీస్‌ పరిశ్రమలు తప్ప ఏమీ లేవు. సుమారు 77 యూనిట్లు మూతపడినట్లు ఏపీఐఐసీ లెక్కలు చెబుతున్నాయి. రహదారులు, కాలువలు పాడయ్యాయి. విద్యుద్దీకరణ లేదు. వీటికి సుమారు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అధికారులు చెప్పినా ఏమీ జరగలేదు. ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పారిశ్రామికవాడను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే సుమారు 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది. బొబ్బిలి లక్ష్మీశ్రీనివాస జనపనార మిల్లు మూతపడడంతో 2,500 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
జీవనాధారం కోల్పోయాం: పారిశ్రామికవాడలోని ఇంపెక్సు కర్మాగారం మూతపడడంతో జీవనాధారం కోల్పోయా. అందులో కార్మికుడిగా పనిచేస్తే రూ.8 వేలు వచ్చేది. రెండేళ్లుగా మూతపడడంతో ఇతర ప్రాంతాలకు కూలి పనుల కోసం వెళ్లిపోతున్నాం. జీవనం కష్టంగా మారింది. ఏం చేయాలో తెలియడం లేదు. 

 అనంతరావు, కార్మికుడు, బూర్జివలస


నమ్మించారు: పారిశ్రామికవాడలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. పనిచేస్తున్న పరిశ్రమల్లో చదువుకు తగ్గ ఉపాధి లేదు. పట్టాలు చేతబట్టుకుని పరిశ్రమల చుట్టూ తిరుతుగుతున్నా ఉపాధి లేదు. గతంలో మినీ స్టీల్‌ప్లాంటు వస్తుందని నమ్మించారు. ఎంతో సంతోషించాం. కానీ ఇంతవరకు ఏ పరిశ్రమ లేదు. మోసపోయాం.

డి.లక్ష్మణరావు, గజరాయునివలస, బాడంగి మండలం


ఐదేళ్లు అవుతున్నా..: లోచర్ల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ఐదేళ్ల నుంచి చెబుతున్నారు. తెదేపా హయాంలోనే భూమిపూజ చేశారు. ఐదేళ్ల అవుతున్నా పని ప్రారంభించలేదు. మా గ్రామానికి వర్షాధారమే. సాగునీరు అందక కరవు పరిస్థితులను చూస్తున్నాం.  

 రెడ్డి గౌరీశంకరరావు, లోచర్ల, తెర్లాం మండలం

నీరుగార్చుతున్నారు: ఎన్నికల ముందు నేతలకు ఎత్తిపోతల పథకాలు గుర్తుకు వస్తాయి. హామీలు ఇవ్వడమే తప్ప పనులు ఎక్కడా కనిపించవు. తోటపల్లి కాలువ నుంచి నీరు పంటపొలాలకు అందడం లేదు. పిల్ల కాలువలు లేవు సరికదా. ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించడం లేదు. దీనివల్ల సాగునీటి పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం.

 కరణం రమేష్‌, ఆమిటి, తెర్లాం మండలం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని