logo

బడుల మరమ్మతులకు సన్నద్ధం

వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది.

Published : 29 Apr 2024 04:31 IST

రఘునాథపల్లి మండలంలో పాఠశాల పనుల పరిశీలనలో అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌, ఇతర అధికారులు (పాత చిత్రం)

జనగామ, న్యూస్‌టుడే: వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. మహిళల భాగస్వామ్యంతో బడులను బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ)లను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలతోనే సౌకర్యాలు మెరుగు పర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. జనగామ జిల్లాలో పనుల గుర్తింపునకు యుడైస్‌ వివరాలను ప్రమాణికంగా తీసుకున్నారు.

రూ.17.88 కోట్లతో పనులు

జిల్లాలోని 12 మండలాల్లో వివిధ యజమాన్యాల కింద 508 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఒక్కో బడిలో తాగునీటి కల్పనకు రూ.లక్ష, చిన్న మరమ్మతులకు రూ.2 లక్షలు, మరుగుదొడ్ల పునర్వినియోగానికి రూ.35 వేల చొప్పున, విద్యుదీకరణ పనులకు రూ.25వేలు, బాలికల మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.3.50 లక్షల చొప్పున అన్ని పాఠశాలలకు కలిపి మొత్తం రూ.17.88 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.

గుర్తింపునకు ప్రత్యేక సర్వే

మన ఊరు మనబడి పథకంలో, ప్రత్యేక అభివృద్ధి నిధులతో పలు చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. దీంతో యుడైస్‌ నివేదికను అనుసరించి పనులు ప్రతిపాదించరాదని నిర్ణయించారు. మన ఊరు మనబడి పథకంలో కనీస సౌకర్యాల కల్పన పనులు పూర్తికాని పక్షంలో తాజా ప్రతిపాదనల్లో చోటు కల్పించనున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా మండల నోడల్‌ అధికారులు, పనులు జరిపించే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సర్వే నిర్వహించి ప్రతిపాదనలను వడపోశారు.

  • ఆవాస పాఠశాలల్లోనూ అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఆదర్శ, కస్తూర్బా తదితర ఆవాస పాఠశాలలు 28 ఉన్నాయి. వీటిలోనూ అవసరమైన కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇది పూర్తయితే, అంచనా వ్యయం పెరగనుంది.
  • ఈ నెల(ఏప్రిల్‌) 18న రూపొందించిన నివేదికను అనుసరించి 491 బడులలో అమ్మ కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. 309 పాఠశాలల్లో గుర్తించిన పనులకు అంచనాలను రూపొందించి ప్రత్యేక పరిశీలన ద్వారా ఖరారు చేశారు. అమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించే పనులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు(అడ్వాన్సు) నిధులను సమకూర్చాలని నిర్ణయించారు.

జూన్‌ 10లోపు పూర్తిచేయాలని లక్ష్యం

బడులు పునః ప్రారంభమయ్యే నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా ఉన్న వసతులు, వనరుల అభివృద్ధి పునర్వినియోగం, తాగునీరు, మరుగుదొడ్ల వసతి, చిన్న, పెద్ద మరమ్మతులు, తరగతి గదులు, బడి ఆవరణను తీర్చిదిద్దడం, విద్యుత్తు బిల్లుల ఖర్చును తగ్గించేందుకు సోలార్‌ పలకల ఏర్పాటు, ఏకరూప దుస్తుల అందజేతపై దృష్టిసారించారు. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఇటీవల పలు పాఠశాలలను సందర్శించారు. అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి రాము జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొన్ని చోట్ల పనులను ప్రారంభించారు. వేసవి సెలవులు పూర్తయ్యేలోపు నిర్దేశించిన పనులను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఈవో రాము వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని