logo

లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె

లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.

Published : 17 May 2024 05:47 IST

దుర్గాభవాని (పాతచిత్రం)

పెనుగొండ, మార్టేరు, న్యూస్‌టుడే: లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది. పెనుగొండ ఎస్సై షేక్‌ సుభాని కథనం ప్రకారం.. వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన యరకరాజు దుర్గాభవాని(39) తన చిన్న కుమార్తె మాధురిలత, మనవడు హరీష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి వెళ్తున్నారు. వీరి వాహనం పెనుగొండ మండలం వడలి గ్రామంలో రైస్‌మిల్లు వద్దకు వచ్చే సరికి సిద్ధాంతం నుంచి పెనుగొండ వస్తున్న లారీ ఢీకొనడంతో దుర్గాభవాని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో అవివాహిత మాధురిలతకు తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పెద్ద కుమార్తె కుమారుడైన హరీష్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై మృతురాలి పెద్ద అల్లుడైన నాగరాజు వెంకట సతీష్‌రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వడలిలో ప్రమాద ఘటన స్థలం

మట్టి గడ్డలే కారణమా..?

ఈ మార్గంలో రెండు రోజులుగా మట్టి రవాణా జరిగిన నేపథ్యంలో మట్టి గడ్డలు రహదారిపై పడ్డాయి. గురువారం ఉదయం సమయంలో చిరుజల్లులు పడటంతో రోడ్డు జారుడు బల్లగా మారింది. దీంతో వాహనాలు అదుపు తప్పి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ద్విచక్రవాహనం మట్టి కారణంగా అదుపు తప్పడం, ఆ క్రమంలో లారీ ఢీకొనడం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పంచాయతీ సిబ్బంది హడావుడిగా రోడ్డుపై పేరుకున్న మట్టిని తొలగించే పని చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని