logo

అర్ధరాత్రి ఇసుక దందా

అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు.

Updated : 17 May 2024 06:50 IST

సుప్రీం వద్దన్నా.. ఆగని అక్రమార్కులు

కరుగోరుమిల్లిలో గ్రామస్థులు అడ్డుకున్న ట్రాక్టర్లు(పాత చిత్రం)

ఆచంట, న్యూస్‌టుడే: అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామస్థులు గండి కొట్టిన దారి పూడ్చినా పదిహేను రోజులపాటు యంత్రాలతో ఇసుక ఎగుమతి చేశారు. 20 టన్నుల పైగా సామర్థ్యం గల లారీల్లో ఇసుక తరలించారు. సుప్రీం కోర్టు తీర్పుతో కరుగోరుమిల్లిలో పగటివేళ ఇసుక రవాణా తాత్కాలికంగా ఆగింది. మళ్లీ రెండు రోజులుగా రాత్రి పూట ట్రాక్టర్లతో దొంగచాటుగా ఇసుక రవాణా సాగిస్తున్నారు.  

వరదల నుంచి ఇప్పటి వరకూ..

గత ఏడాది వరదలకు ముందే అధికారికంగా అన్ని ర్యాంపుల్లో తవ్వకాలు నిలిపివేశారు. అయితే అయిదారు నెలలుగా అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం చీకటి వ్యాపారం సాగించారు. ఆచంట నియోజకవర్గంలో అన్ని ర్యాంపుల్లో ఇసుక దోపిడీ సాగింది. ఇటీవల నడిపూడి ర్యాంపునకు అనుమతి లభించిందంటూ పట్టపగలే వారం రోజుల పాటు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలించారు. గ్రామస్థులు ఎదురు తిరగడంతో అక్కడ నిలిపి వేశారు. గోదావరి తీరంలోని సిద్ధాంతం, నడిపూడి, కరుగోరుమిల్లి ర్యాంపుల ద్వారా వీలు చిక్కినప్పుడల్లా రాత్రిపూట ఇసుక రవాణా చేస్తున్నారు. కరుగోరుమిల్లి గ్రామంలో ఉగాది రోజు ఇసుక అక్రమ రవాణాను గ్రామస్థులు అడ్డుకుని వాహనాలు అధికారులకు అప్పగించి, ర్యాంపునకు గండి కొట్టారు. కానీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

ఇసుక ఇష్టానుసారం తవ్వకంతో కరుగోరుమిల్లి వద్ద తీరం

ట్రాక్టర్‌ రూ.3500

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్‌కు రూ.3,000 నుంచి 3,500 వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక్కడ పది పదిహేను మంది కార్మికులతో ఒకటి రెండు ట్రాక్టర్లు ఎగుమతి చేయించి, తర్వాత పొక్లెయిన్‌ సాయంతో ఎగుమతి చేసి, కూలీలకు కొంత ముట్టచెబుతున్నారని స్థానికులు తెలిపారు. గోదావరి తీరంలో అనుమతి లేని సమయంలో ఇసుక అక్రమ రవాణాపై సిద్ధాంతం, నడిపూడి, కరగోరుమిల్లిలో ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. రాత్రి పూట నిఘా వేయాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ విషయమై ఆచంట తహసీల్దార్‌ ఐపీˆ శెట్టిని సంప్రదించగా క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. మైనింగ్‌ అధికారులు చరవాణికి అందుబాటులోకి రాలేదు.


రాత్రిపూట రవాణా..

ఆచంట మండలంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లభించిందని చెబుతున్న కరుగోరుమిల్లిలో పరిశీలిస్తే పోలింగ్‌ తేదీ నాటికి ఇసుక రవాణా నిలిపి వేశారు. పోలింగ్‌ తేదీకి రెండు రోజుల ముందు ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపి వేయాలని, అనుమతులు ఉన్నా నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కరుగోరుమిల్లిలో రెండు రోజులుగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక దందా సాగుతోంది. మేనెల తర్వాత వర్షాలు పడితే గోదావరిలోకి నీరు చేరి రవాణా నిలిచిపోతుంది. ఈలోపే అందినంత దండుకోవాలని రాత్రిపూట ఇసుక దందా కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని