logo

తేమ పేరుతో కోత

ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు.

Published : 17 May 2024 06:05 IST

దోపిడీకి తెర తీసిన మిల్లర్లు

పాలకొల్లు నుంచి పెనుమదం వెళ్లే రహదారిలో ఉన్న పలు రైస్‌మిల్లులకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ధాన్యాన్ని ట్రాక్టర్లపై తీసుకొచ్చి దిగుమతుల కోసం పడిగాపులు కాస్తున్నారు.


పాలకొల్లు గ్రామీణ, పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. రైతు భరోసా కేంద్రాల నుంచి 17 శాతం తేమతో ధాన్యాన్ని ట్రాక్టర్లపై మిల్లులకు తరలిస్తున్న రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్లిన తర్వాత  తేమశాతం 20 నుంచి 22 వరకు ఉందని మిల్లుల యాజమాన్యాలు కొర్రీలు వేస్తున్నాయి. వీటి నుంచి బయట పడాలంటే బస్తాకు 2 కిలోల ధాన్యాన్ని ఇవ్వాలని, లేదంటే కిలోకు రూ.22 చొప్పున రూ.44 నగదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కొంత మంది రైతులు వేరే రైస్‌ మిల్లులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఇంతకంటే మరీ దారుణమైన పరిస్థితి ఎదురైంది. బస్తాకు 3 నుంచి 4 కిలోల వరకు ధాన్యం ఇవ్వాలంటూ ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో ఆర్బీకే సూచించిన మిల్లుల వద్దకే ధాన్యాన్ని తీసుకెళ్లారు. అక్కడ జట్టు కూలీలు సరిపడా లేరు. అంతే కాకుండా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ధాన్యం దిగుమతులు చేసుకుంటున్నారు.   తేమశాతం సాకుతో కోత విధిస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.


మూడు రోజులు ట్రాక్టర్‌ కిరాయి
- సురేంద్ర, నౌడూరు, రైతు.

రెండు రోజుల నుంచి పడిగాపులు గాసినా ధాన్యం తీసుకోలేదు. ఆర్బీకే సూచించిన మేరకు ఈ మిల్లుకు తీసుకొచ్చాం. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఈ నెల 15న ట్రక్కు షీటు తీసుకొచ్చా. ధాన్యంతో పాటు రహదారి పక్కనే ట్రాక్టరు నిలిపి ఉంచా. 17వ తేదీన గానీ దిగుమతి అయ్యేలా కనిపించడం లేదు. దీంతో మూడు రోజులు ట్రాక్టరు కిరాయి చెల్లించాల్సి వస్తోంది. భోజనం, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం.


రూ.44 వంతున చెల్లించాం..
- కె.రాజు, ఆచంట, రైతు

పంటలు బాగా పండాయి. ధాన్యం అమ్ముకుంటే ఒడుదొడుకుల నుంచి గట్టెక్కుతాం అని భావించాం. ఇదే తరుణంలో వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. కోతలు వేగంగా పూర్తి చేసుకుని మిల్లులకు ధాన్యాన్ని తీసుకొచ్చా. ఇక్కడి నిర్వాహకులు ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని బస్తాకు రూ.44 వంతున చెల్లించాలన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో నేను తీసుకొచ్చిన ధాన్యానికి రూ.5,200 చెల్లించా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని