logo

శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు

‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది.

Updated : 18 May 2024 06:07 IST

కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు

 

రితిక (పాతచిత్రం)

సూర్యారావుపేట(విజయవాడ), న్యూస్‌టుడే : ‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. మరణించి ఒక రోజు గడిచినా యువతిని వెంటిలేటర్‌పై ఉంచామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టి శుక్రవారం ఉదయం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అగ్రహోదగ్రులయ్యారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కుమార్తె విగతజీవిగా కళ్లెదుట కనిపించే సరికి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చూపరులను కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..

ఆసుపత్రి ముందు బైఠాయించిన రితిక బంధువులు, కుటుంబసభ్యులు

విజయవాడ గాంధీనగర్‌కు చెందిన పేర్ల లక్ష్మీ వెంకట రితిక (18) నందిగామ మిక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తండ్రి రమేష్‌కు వస్త్రలతలో దుకాణం ఉంది. తల్లి కవిత గృహిణి. వారికి కుమారుడు, కుమార్తె. రితికకు చిన్నప్పటి నుంచి కాలు వంకరగా ఉండటంతో 2019లో నగరంలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ప్లేట్లు అమర్చారు. ఇటీవల ఆసుపత్రిలో చూపించుకోగా అంతా బాగానే ఉందని కాలిలో ఉన్న ప్లేట్లను తీసేద్దామంటూ వైద్యుడు సూచించారు. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ఉదయం ఆసుపత్రిలో చేరారు.
మత్తు వికటించిందని చెప్పి..: బుధవారం సాయంత్రం 6 గంటలకు శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. రితికకు ఇచ్చిన మత్తు మందు వికటించిందంటూ రాత్రి 10.30 గంటల సమయంలో వెంటిలేటర్‌పై ఉంచామని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. బుధవారం రాత్రి నుంచి వెంటిలేటర్‌పై ఉందని చెప్పిన వైద్యులు శుక్రవారం ఉదయం రితిక మరణించిందని ప్రకటించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రిని మూసివేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెదేపా నాయకుల మద్దతు: రితిక పెదనాన్న తెదేపా నాయకుడు కావడంతో విషయాన్ని బొండా ఉమామహేశ్వరరావుకు తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, తెదేపా ఫ్లోర్‌లీడర్‌ నెల్లిబండ్ల బాలస్వామి తదితరులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులకు సంఘీభావం ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తెదేపా నాయకులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కేసు పెట్టాలని పోలీసులు వారికి సూచించారు. దీంతో రితిక మేనత్త రేణుకాదేవి సూర్యారావుపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు వైద్యులపై సూర్యారావుపేట పోలీసులు 304 ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం

గన్నవరం గ్రామీణం, హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : ఓ వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గన్నవరం పోలీసుల వివరాల ప్రకారం.. గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన తాడంకి నాగబాబు(21) 2020 సంవత్సరం మార్చి 12న ద్విచక్ర వాహనంపై వీకేఆర్‌ కళాశాల రోడ్డులో బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో అప్పటికే పాత కక్షలు ఉండటంతో అజ్జంపూడికే చెందిన కొడవలి శివ అలియాస్‌ నాని, ఓ సీసాలో పెట్రోల్‌తో అక్కడకు చేరుకున్నాడు. నాగబాబు కళ్లలో కారం కొట్టి, పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన నాగబాబును సోదరుడు జోజిబాబు హుటాహుటిన పోరంకిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి విజయవాడ జీజీహెచ్‌కు మార్చారు. చికిత్స పొందుతూ 2020 మార్చి 16న నాగబాబు ప్రాణాలు కోల్పోయాడు. కొడవలి శివ భార్యకు, తన సోదరుడికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో శివ అంతకుముందు బెదిరింపులకు దిగాడని, ఆ క్రమంలోనే పథకం ప్రకారం హతమార్చాడంటూ జోజిబాబు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పటి ఎస్సై రమేష్‌బాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత సీఐ కె.శివాజీ ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి, ఛార్జిషీటు వేసి విజయవాడ 8వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి డి.లక్ష్మి, పీపీ జి.కల్యాణి మొత్తం 18 మంది సాక్షులను విచారించి, నిందితుడు కొడవలి శివ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. శుక్రవారం న్యాయస్థానంలో తుది విచారణ సందర్భంగా నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.లక్ష్మి తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో 15రోజులు జైలు విధించాలన్నారు. కేసు విచారణలో కీలక పాత్ర పోషించినందుకు గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీఐ కేవీఎస్వీ ప్రసాద్‌, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని