మాదకాసురుల స్వైరవిహారం

ఆసేతుహిమాచలం మర్రిఊడల్లా విస్తరించిన మాదకద్రవ్యాల సరఫరాదారులు- యువభారత భవితకు ప్రథమ శత్రువులవుతున్నారు. వ్యవస్థీకృతంగా పనిచేస్తూ,  బడిపిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు.

Published : 27 Mar 2023 00:48 IST

ఆసేతుహిమాచలం మర్రిఊడల్లా విస్తరించిన మాదకద్రవ్యాల సరఫరాదారులు- యువభారత భవితకు ప్రథమ శత్రువులవుతున్నారు. వ్యవస్థీకృతంగా పనిచేస్తూ,  బడిపిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. నవతరాన్ని పెనుచీకట్లలోకి నెట్టుకుపోతున్న నెత్తుటి వ్యాపారాన్ని నిక్షేపంగా కొనసాగిస్తున్న మాదకాసురులు కోట్లకుకోట్లను వెనకేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మాదకద్రవ్యాల రవాణా- జాతీయ భద్రత’ అంశంపై ప్రాంతీయ సదస్సుకు మొన్న శుక్ర, శనివారాల్లో బెంగళూరు వేదికయ్యింది. అయిదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాలుపంచుకొన్న ఆ సదస్సులో ‘మాదకద్రవ్య రహిత భారతావని’కోసం మేధామథనం జరిగింది. మత్తు విపత్తులోంచి దేశాన్ని రక్షించుకునేందుకు త్రిముఖ వ్యూహాన్ని అనుసరించనున్నట్లు కేంద్ర హోంశాఖామాత్యులు అమిత్‌ షా ఆ సందర్భంగా ప్రకటించారు. మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యతలను వహిస్తున్న సర్కారీ సంస్థలను బలోపేతం చేయడం, వాటి నడుమ సమన్వయాన్ని పటిష్ఠపరచడం, జనజాగృతికి ప్రచారోద్యమాన్ని నిర్వహించడం ద్వారా ‘నషా ముక్త్‌ భారత్‌’ను సాధించగలమనే ఆశాభావాన్ని మంత్రివర్యులు వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా 75వేల కేజీల మత్తుమందులను పట్టుకుని ధ్వంసం చేయాలని కేంద్రం నిరుడు లక్ష్యంగా నిర్దేశించుకొంది. దానికి మించి గడచిన పది నెలల్లో 5.94 లక్షల కేజీల మాదకద్రవ్యాలను యంత్రాంగం నాశనం చేసింది.  అనూహ్యంగా భారీగా స్వాధీనమవుతున్న మాదకద్రవ్యాలకు ఎన్నో రెట్ల పరిమాణంలో ‘సరకు’ భద్రంగా లక్షిత స్థలాలకు చేరుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు సదస్సులో అమిత్‌ షా ఉద్ఘాటించినట్లు- మత్తుమందుల రవాణా ఏ ఒక్క రాష్ట్రానికో కేంద్రానికో సంబంధించిన సమస్య కాదు... అది యావత్‌ జాతినీ పట్టిపీడిస్తున్న పెను జాడ్యం. దాన్ని నిర్మూలించాలంటే- జాతీయస్థాయి ఐక్య కార్యాచరణ తప్పనిసరి!

భారతావనిని మత్తు ఊబిలోంచి బయటపడేయాలంటే- మాదకద్రవ్యాల ఆనుపానులను అతివేగంగా ఆరాతీయాలి. సంబంధిత నేర నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేసి, అపరాధులను కఠినంగా దండించాలి. ఈ మేరకు ప్రణాళికాబద్ధ కృషిపై ప్రభుత్వాలెంతగా ఊదరగొడుతున్నా కొన్నేళ్లుగా విభిన్న మార్గాల్లో మాదకద్రవ్యాలు దేశంలోకి గుట్టలుగుట్టలుగా వచ్చిపడుతూనే ఉన్నాయి. 2017లో దేశవ్యాప్తంగా 2,146 కేజీల హెరాయిన్‌ దొరికితే- 2021లో అది ఏడువేల కేజీలకు పైగా పట్టుబడింది. మాదకద్రవ్యాల నియంత్రణా సంస్థ(ఎన్‌సీబీ) డీజీ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ నిరుడు వెల్లడించిన గణాంకాల ప్రకారం- నల్లమందు, గంజాయి తదితరాల స్వాధీనమూ అదే సమయంలో కుప్పలుతెప్పలైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల నుంచి పలు ప్రాంతాలకు గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతున్నట్లు కథనాలెన్నో వెలుగుచూస్తున్నాయి. హెరాయిన్‌ వంటివి సముద్ర మార్గంలో భారీస్థాయిలో దేశంలోకి చొరబడుతున్నట్లు అధికారిక విశ్లేషణలే వెల్లడిస్తున్నాయి. ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, కస్టమ్స్‌, రాష్ట్రాల పోలీసు విభాగాలు సమష్టిగా పరిశ్రమిస్తే తప్ప మాదకమాఫియా పీచమణచడం సాధ్యపడదు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో... ఈశాన్య రాష్ట్రాల్లో మత్తుమందుల స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అక్కడి బలగాలకు తగిన సాధనా సంపత్తిని సమకూర్చడమూ అత్యంత కీలకం. రాష్ట్రంలో మాదకద్రవ్యాల జాడలను రూపుమాపేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను కొలువుతీర్చిన తెలంగాణ ప్రభుత్వం సత్ఫలితాలను సాధిస్తోంది. సింగపుర్‌, కంబోడియా వంటి దేశాలు మరణశిక్షలతో మాదక ముఠాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తద్భిన్నంగా సకాలంలో కఠిన దండనలు కరవవుతున్న ఇండియాలో మాదక రక్కసుల కోరలు పోనుపోను పదునుతేలుతున్నాయి. దేశ భవిష్యత్తుకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్న ఆ దురవస్థ తప్పిపోవాలంటే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మత్తుమందులపై పోరు బహుముఖం కావాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.