దేశానికి దోమకాటు!

వానాకాలం జోరెత్తడంతోనే దేశంలో డెంగీ కేసుల ప్రజ్వలనం ఏటా ఆనవాయితీగా మారింది. విషజ్వరాలు, అంటురోగాలతోపాటు దట్టంగా ముసురేయడమే కాదు- కొత్త ప్రాంతాలకు విస్తరించడం డెంగీ స్వాభావిక లక్షణంగా స్థిరపడింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా పరిశీలనాంశాలు మరింత ఆందోళనకర స్థితిగతులకు అద్దం పడుతున్నాయి.

Published : 07 Jun 2023 01:08 IST

వానాకాలం జోరెత్తడంతోనే దేశంలో డెంగీ కేసుల ప్రజ్వలనం ఏటా ఆనవాయితీగా మారింది. విషజ్వరాలు, అంటురోగాలతోపాటు దట్టంగా ముసురేయడమే కాదు- కొత్త ప్రాంతాలకు విస్తరించడం డెంగీ స్వాభావిక లక్షణంగా స్థిరపడింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా పరిశీలనాంశాలు మరింత ఆందోళనకర స్థితిగతులకు అద్దం పడుతున్నాయి. 2001 సంవత్సరం నాటికి దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు పరిమితమైన డెంగీ ఇప్పుడు ఎక్కడా మినహాయింపు లేకుండా భారత్‌ అంతటా ఉనికిని బలంగా చాటుకొంటున్నదని ఐసీఎంఆర్‌ నిర్ధారిస్తోంది. డెంగీ కారక దోమ ద్వారా వ్యాపించే ‘జికా’ కేసులు గతంలో గుజరాత్‌, తమిళనాడులలోనే పరిమితంగా నమోదయ్యేవి. నేడా జాబితా తెలంగాణ, కేరళ, ఝార్ఖండ్‌ సహా 11 రాష్ట్రాలకు విస్తరించడం- దోమల నియంత్రణలో వైఫల్య పర్యవసానాలను చాటుతోంది. అంతర్జాతీయంగానూ డెంగీ కోర సాచిన తీరును సూడాన్‌, అర్జెంటీనా, బంగ్లాదేశ్‌ తదితర దేశాల అనుభవాలు కళ్లకు కడుతున్నాయి. దేశం లోపల, వెలుపల డెంగీ విజృంభణకు ప్రబల హేతువులేమిటో సుస్పష్టం. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, ప్రపంచీకరణ, వాతావరణ మార్పులు, సామాజిక ఆర్థిక అభివృద్ధి, జీవనశైలి మార్పుల కారణంగా డెంగీకి కోరలు మొలుచుకు వస్తున్నాయన్నది వివిధ అధ్యయనాలు చాటుతున్న యథార్థం. డెంగీ, జికా, మలేరియా కేసుల ఉద్ధృతి వెనక తరతమ భేదాలతో ఆయా దేశాల అలసత్వమూ ప్రస్ఫుటమవుతోంది. ప్రస్తుతం సగానికిపైగా ప్రపంచ దేశాల్లో డెంగీ రూపేణా పెనుముప్పు బుసలు కొడుతోంది. చైనా, శ్రీలంకల్లాగా దోమల నియంత్రణలో ప్రణాళికాబద్ధ కార్యాచరణతో ముందడుగు వేయలేని ప్రభుత్వాల వైఫల్యం ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తోంది!

దేశంలో ఏటా రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు డెంగీ కేసులు నమోదవుతున్నట్లు ఐసీఎంఆర్‌ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా అవి 10-40 కోట్ల స్థాయిలో ఉంటున్నట్లు అంచనా. గత సంవత్సరం దేశవ్యాప్తంగా రికార్డులకు ఎక్కిన మొత్తం డెంగీ కేసులలో 60 శాతందాకా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనే వెలుగు చూశాయి. ఆ మూడు రాష్ట్రాల్లో ఇదే తరహా ఉద్ధృతి 2017లో, అంతకుముందు 2012లోను నమోదైంది. నాలుగేళ్ల క్రితం ఆ ఏడాది డెంగీ జడలు విరబోసుకున్న అయిదు రాష్ట్రాల్లో నాలుగు (కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ) దక్షిణాదికి చెందినవేనని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభాముఖంగా ప్రకటించింది. ఏడాదిక్రితం యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ వంటి 13 రాష్ట్రాలు దోమకాటుతో విలవిల్లాడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు తీవ్ర ఆందోళన వ్యక్తపరచారు. ఇప్పుడా ఉత్పాతం దేశమంతటినీ కమ్మేసినట్లు ఐసీఎంఆర్‌ తాజా హెచ్చరిక స్పష్టీకరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మదింపు ప్రకారం- డెంగీ, మలేరియాల మూలాన భారత్‌కు ఏటా రూ.18000 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఇతరేతర అంటురోగాలు, విషజ్వరాలను కలిపి గణిస్తే ఆర్థిక నష్టం భారీగానే లెక్క తేలుతుంది. ప్లేట్‌లెట్ల పేరు చెప్పి రోగుల సంబంధీకుల్ని బెంబేలెత్తించి లక్షల రూపాయలు గుంజేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల దాష్టీకాలను అంచనా కట్టగలవారెవరు? కేసుల తీవ్రత అధికంగా ఉన్న చోట్లే కాదు- అన్ని రాష్ట్రాల్లోనూ వానలు ముమ్మరించకముందే డ్రెయినేజీల మరమ్మతులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తికావాలి. ఎక్కడా పారిశుద్ధ్య లోపాలకు తావివ్వకూడదు. రక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చురుకందుకోవాలి. చెత్తకుప్పలు, మురుగు ప్రవాహాలు లేకుండా తీసుకునే జాగ్రత్తలు మశక సంతతిని నియంత్రించడంలో అత్యంత కీలకమవుతాయి. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను ప్రాథమ్య ప్రాతిపదికన పరిపుష్టీకరించాలి. జనావాస పరిసరాలు దోమలకు నెలవులు కాకుండా కాపాడుకోవడంలో వ్యవస్థాగత అలసత్వం కొనసాగినన్నాళ్లు- డెంగీ కట్టడి ఎండమావే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.