icon icon icon
icon icon icon

ఆదిలాబాద్‌

Published : 01 Apr 2024 14:23 IST

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఆదిలాబాద్‌ (Adilabad Lok Sabha constituency) ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దీన్ని ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌ దీని పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గోడం నగేష్‌పై భాజపా అభ్యర్థి సోయం బాపురావు 58,560 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్‌, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. అభ్యర్థుల బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలపై అధిష్ఠానాలు దృష్టిసారించాయి. సొంత పార్టీల్లోని ముఖ్య నేతల ద్వంద్వ వైఖరి, అంకితభావంతో పని చేసే కింది స్థాయి కార్యకర్తల పనితీరుకు ఇది గిటురాయిగా నిలుస్తోంది. అందరిని సమన్వయం చేసుకుని విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, విమర్శలకు తావీయకుండా నడుచుకోవాలని మూడు పార్టీల అగ్రనేతలు సూచించడంతో బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులకు పరీక్షగా మారింది.

కాంగ్రెస్‌కు కొత్త అభ్యర్థిత్వం..

ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ పార్లమెంటరీ ఎన్నికల పోరులో నిలవడం ఇదే ప్రథమం. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అండదండలు, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) సానుకూలతతో అభ్యర్థిగా రాణించగలిగినప్పటికీ  టికెట్‌ చేజారిన మిగిలిన ఆశావహ అసంతృప్తులను దారికి తెచ్చుకోవటం పరీక్షే. మహిళ కావటం, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఇటీవల భారాసకు చెందిన కీలకనేతలు కాంగ్రెస్‌లో చేరటం, అందర్నీ సమన్వయం చేసే బాధ్యతను సీతక్క తీసుకోవటం సుగుణకు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భాజపా బలం కొనసాగేనా?

భాజపా టికెట్‌ గోడం నగేష్‌ని వరించటమే ఓ అనూహ్య మలుపు. ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ సంస్థాగత ఆచరణలతో నడిచే భాజపా సిద్ధాంతాలకు కొత్త కావటం కొంత ఇబ్బందికరమైన అంశమే. ప్రధానమంత్రి మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అండదండలు ఉండటం కలిసివచ్చే అంశాలు.

భారాసకు భరోసా లభించేనా?

భారాస టికెట్‌ను ఏకపక్షంగా దక్కించుకోవటంలో విజయం సాధించిన ఆత్రం సక్కు పార్టీలో నెలకొన్న అనిశ్చితిని ఛేదించాల్సి ఉంది.  ఆదిలాబాద్‌లో జోగు రామన్న, ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మీ, బోథ్‌లో అనిల్‌ జాదవ్‌ బలంగానే ఉన్నప్పటికీ మిగిలిన నిర్మల్‌, ముథోల్‌, సిర్పూర్‌(టి), ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగే నేతల కోసం అన్వేషించాల్సి వస్తోంది. స్వతహాగా జనాన్ని ప్రభావితం చేయగలిగే రాజకీయ అనుభవం ఉండటం, బయట పడకుండా వ్యూహాలతో అనుకున్నది నెరవేర్చుకునే లక్షణం కలిగి ఉండటం ఆత్రం సక్కుకు కలిసివచ్చే అంశమే.

 • గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీళ్లే!
 • 1952 - సి.మాధవరెడ్డి (సోషలిస్ట్‌ పార్టీ)
 • 1957- కె.ఆశన్న (కాంగ్రెస్‌)
 • 1962- జి.నారాయణరెడ్డి (కాంగ్రెస్‌)
 • 1967 - పి.గంగారెడ్డి (కాంగ్రెస్‌)
 • 1971 -పి.గంగారెడ్డి (కాంగ్రెస్‌)
 • 1977 - జి.నర్సింహారెడ్డి (కాంగ్రెస్)
 • 1980 - జి.నర్సింహారెడ్డి (కాంగ్రెస్‌)
 • 1984 - సి.మాధవ్‌రెడ్డి (తెదేపా)
 • 1989- పి.నర్సింహారెడ్డి (కాంగ్రెస్‌)
 • 1991 - అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి (తెదేపా)
 • 1996 - ఎస్‌.వేణుగోపాలాచారి (తెదేపా)
 • 1998- ఎస్‌. వేణుగోపాలాచారి (తెదేపా)
 • 1999- ఎస్‌.వేణుగోపాలాచారి(తెదేపా)
 • 2004 - మధుసూదన్‌రెడ్డి (తెరాస)
 • 2009- రమేష్‌ రాఠోడ్‌ (తెదేపా)
 • 2014 - గోడం నగేష్‌ (తెరాస)
 • 2019- సోయం బాపురావు (భాజపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని