icon icon icon
icon icon icon

BJP: లైంగిక వేధింపుల ఎఫెక్ట్‌.. బ్రిజ్‌భూషణ్‌ స్థానంలో కుమారుడికి టికెట్‌

BJP: లోక్‌సభ ఎన్నికలకు భాజపా మరో విడత జాబితా విడుదలైంది. ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీలో అభ్యర్థిని ప్రకటించింది.

Published : 02 May 2024 17:31 IST

దిల్లీ: అనుకున్నట్లే జరిగింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan)ను ఈ ఎన్నికల్లో (Lok Sabha Elections) భారతీయ జనతా పార్టీ (BJP) పక్కనబెట్టింది. అయితే  ఆ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్‌ కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ స్థానం నుంచి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయబరేలీ (Raebareli) నుంచి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ను నిలబెట్టింది.

కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్రిజ్‌భూషణ్‌ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే, జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో ఆయనను భాజపా హైకమాండ్‌ పక్కనబెట్టింది.

కానీ, ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా బ్రిజ్‌భూషణ్‌కు పేరుంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ.. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించారు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో ఆయన హవా కనపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కైసర్‌గంజ్‌ స్థానంలో పార్టీ ఆయన కుమారుడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

బ్రిజ్‌భూషణ్‌ చిన్న కుమారుడైన కరణ్‌ ప్రస్తుతం యూపీ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. గోండాలోని కో-ఆపరేటివ్‌ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌ మరో కుమారుడు ప్రతీక్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

రాయ్‌బరేలీ బరిలో మంత్రి..

ఇక, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ స్థానంలో రాష్ట్ర మంత్రి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ను బరిలోకి దించింది. 2019 ఎన్నికల్లోనూ ఈయన సోనియాపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2022లో శాససమండలి నుంచి ఎన్నికై కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. తొలుత ఈ స్థానం నుంచి వరుణ్‌ గాంధీని నిలబెడతారని ప్రచారం జరిగింది. పార్టీ ప్రతిపాదనకు ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.

కాగా.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సోనియా ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. కుమార్తె కోసమే ఆమె పోటీ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్నా.. దీనిపై కాంగ్రెస్‌ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు హస్తం పార్టీ ఈ రోజే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.

కైసర్‌గంజ్‌, అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి తుదిగడువు రేపటి (మార్చి 3)తో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img