icon icon icon
icon icon icon

Varanasi: ప్రధానిపై పోటీ.. కమెడియన్‌ శ్యామ్‌ రంగీలాకు షాక్‌

Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది.

Updated : 16 May 2024 10:36 IST

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి (Varanasi) లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా (Comedian Shyam Rangeela) పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే ఆయన నామినేషన్‌ (Shyam Rangeela Nomination) పత్రాలను తిరస్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్‌కు చెందిన శ్యామ్‌ రంగీలా.. ప్రధాని మోదీ (Narendra Modi) గొంతును అనుకరిస్తూ సోషల్ మీడియాలో పాపులర్‌ అయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి వార్తల్లో నిలిచారు. అయితే, నామినేషన్‌ (Nomination) సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని రెండు రోజుల క్రితం ఆరోపించారు. తొలుత మే 10, 13వ తేదీల్లో నామినేషన్‌ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

నటుడిపై తల్లి పోటీ.!

అనంతరం చివరి రోజైన మే 14న నామినేషన్‌ వేయడానికి వెళ్లగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు నామినేషన్ల ముగింపు గడువుకు రెండు నిమిషాల ముందు మధ్యాహ్నం 2.58 గంటలకు నామినేషన్‌ వేసినట్లు చెప్పారు. అయితే, మరుసటి రోజు ఎన్నికల అధికారులు (Election Commission) నామినేషన్లను పరిశీలించి శ్యామ్‌ రంగీలా (Shyam Rangeela) పత్రాలను తిరస్కరించారు. నామినేషన్‌ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్‌పై ప్రమాణం చేయలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా.. అధికారుల తీరును కమెడియన్‌ (Comedian Shyam Rangeela) తీవ్రంగా తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఏడో విడతలో భాగంగా వారణాసి స్థానానికి జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానం నుంచి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా.. 36 మంది పత్రాలను అధికారులు తిరస్కరించారు. ప్రధాని మోదీ కూడా చివరి రోజైన మే 14న ఇక్కడ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు పోటీగా కాంగ్రెస్‌ నుంచి అజయ్‌ రాయ్‌ బరిలోకి దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img