icon icon icon
icon icon icon

Amit Shah: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్‌ షా

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు. 

Published : 15 May 2024 19:25 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో జైలుకు వెళ్లిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. ఒక జాతీయ పార్టీ అధినేతగా ఉన్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జూన్‌ 1 వరకు బెయిల్‌ మంజూరుచేసింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అసాధారణంగా కనిపిస్తోందన్నారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌ షా మండిపడ్డారు. ‘‘కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుంది. ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. దోషులుగా తేలినవారిని న్యాయస్థానం జైలుకు పంపదని చేప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నారో లేదా దుర్వినియోగం చేస్తున్నారో మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలి’’ అని షా పేర్కొన్నారు.

ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ

తిహాడ్‌ జైల్లో కెమెరాల ద్వారా తన కదలికలు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుతున్నాయని కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను షా కొట్టిపారేశారు. ఆ జైలు పాలన అధికారం దిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉందని గుర్తుచేశారు. కేజ్రీవాల్‌ కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేవలం 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్‌.. విద్యుత్‌ బిల్లులు మాఫీ చేస్తామని దేశమంతటికీ హామీ ఇస్తోందని ఎద్దేవా చేశారు. తక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేయగలరని ప్రశ్నించారు.

ఆయన మళ్లీ.. జైలుకే

‘‘తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్‌ చెబుతున్నారు. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదు. ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్‌ మాత్రమే ఇచ్చింది. మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సిందే. ఇది కేజ్రీవాల్‌కు అనుకూల తీర్పు ఎలా అవుతుంది’’ అని అమిత్‌ షా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img