icon icon icon
icon icon icon

Rajnath Singh: ఒక మహిళా ఎమ్మెల్యేనే అలా ఫీల్‌ అయితే.. ఇక సామాన్యుల గతేంటి?

ప్రశ్నపత్రాల లీకేజీల ద్వారా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు.

Published : 22 Nov 2023 18:19 IST

జైపుర్‌: రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, భాజపా అగ్రనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన..  అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌ ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడటం ద్వారా యువత భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఉదయ్‌పుర్‌ జిల్లాలోని ఖుర్వారా, జడోల్‌లలో ఆయన బుధవారం ప్రచారం నిర్వహించారు. రాజస్థాన్‌లో పరిస్థితులు బాగాలేవన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే తనకు రక్షణ లేదని భావిస్తున్నారంటే.. ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరగడంతో పాటు ప్రశ్నపత్రాలు లీక్‌ అవుతుండటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి కోసం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని.. ఒకవేళ ఏదైనా చేస్తే అది కుర్చీని కాపాడుకొనేందుకేనన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బదులు.. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారని రాజ్‌నాథ్‌ విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img