Congress: మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌

కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Published : 06 May 2024 00:09 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ హసన ఎంపీ, జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ అసభ్యకర వీడియోల వ్యవహారం కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మౌనం వహించడంపై కాంగ్రెస్‌ (Congress) మండిపడుతోంది. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌ను తిరిగి భారత్‌కు రప్పించాలని ఆదివారం డిమాండ్‌ చేసింది. దీనిపై ఇకనైనా మౌనం వీడాలని ప్రధానిని కోరింది.

ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ మౌనం వహించడంపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ చీఫ్ అల్కా లాంబా మండిపడ్డారు. ప్రజ్వల్‌ను తిరిగి తీసుకొచ్చే వరకు మహిళా సంఘాలు తమ నిరసన స్వరాన్ని పెంచుతూనే ఉంటారని పేర్కొన్నారు. మహిళలకు జరిగిన అన్యాయం పట్ల పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఈ వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ రాశారని తెలిపారు.

వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!

‘‘సామూహిక అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రమేయం గురించి తెలియజేస్తూ రాష్ట్ర భాజపా అధ్యక్షుడికి ఆ పార్టీ నేత ఒకరు లేఖ రాశారు. ఈ నేరం గురించి కాషాయ పార్టీకి ముందే తెలుసు. అయినప్పటికీ అతడికి మద్దతుగా మోదీ నిలబడ్డారు. అతడిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వ్యవహారంలో మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ఏప్రిల్‌ 30 ఎన్‌సీడబ్యూని కలిసింది. కానీ, ఆ కమిషన్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడం ఆందోళనకరం’’ అని అల్కా లాంబా పేర్కొన్నారు. మరోవైపు.. ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించేందుకు ‘బ్లూ కార్నర్‌’ నోటీసులు జారీ చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర వెల్లడించారు. అందుకోసం ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని