Sex Harassment Case: ‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశించారు.

Published : 06 May 2024 00:08 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) అక్కడి పోలీసులు ఏర్పాటు చేసిన సమయంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని రాజ్‌భవన్‌ సిబ్బందిని గవర్నర్‌ ఆదేశించారు.

‘ప్రస్తుతం కొనసాగుతోన్న దర్యాప్తునకు సంబంధించి రాజ్‌భవన్‌ సిబ్బంది.. అన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎటువంటి ప్రకటనలు చేయకూడదు. వ్యక్తిగతంగా, ఫోన్‌లో లేదా మరే మాధ్యమం ద్వారానైనా బహిరంగంగా మాట్లాడటం నిషేధం’ అని గవర్నర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361(2), (3), ప్రకారం గవర్నర్‌పై దర్యాప్తు/విచారణ వంటి ఏ చర్యలకు ఉపక్రమించకూడదు. రాష్ట్రపతి లేదా గవర్నర్‌.. పదవిలో ఉన్న సమయంలో ఏ న్యాయస్థానంలోనూ క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదు. అరెస్టు ప్రక్రియను కూడా చేపట్టకూడదు’ అని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ గుర్తుచేశారు.

ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయమై తనను గవర్నర్‌ రెండు సార్లు పిలిపించారని, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ బూటకమని గవర్నర్‌ ఆనంద బోస్‌ కొట్టిపారేశారు. రాజ్‌భవన్‌లో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని