icon icon icon
icon icon icon

వైయస్‌ఆర్‌.. ఎటువైపు సార్‌?

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లో ఎన్డీయే కాలుదువ్వుతోంది. మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల వైకాపాతో హోరాహోరీగా తలపడుతోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు పలు నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.

Updated : 28 Apr 2024 06:47 IST

కాలు దువ్వుతున్న తెదేపా, మిత్రపక్షాలు వైకాపాకు గట్టి సవాలు
3 చోట్ల తెదేపాకు మొగ్గు
మరో రెండు చోట్లా పోటాపోటీ
ముస్లిం, క్రిస్టియన్లలో కాంగ్రెస్‌కు క్రాస్‌ ఓటింగ్‌
(వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి ఈనాడు ప్రతినిధి)

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లో ఎన్డీయే కాలుదువ్వుతోంది. మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల వైకాపాతో హోరాహోరీగా తలపడుతోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు పలు నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఇది వైకాపాకు ఊహించని పరిస్థితే. అందుకే చివరి అస్త్రంగా ఆ పార్టీ డబ్బు వెదజల్లుతోంది. గత ఐదేళ్లూ పులివెందుల మినహా మిగతా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. యువతను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవే కీలకంగా మారాయి. ప్రజలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరులో కొంత మొగ్గు తెదేపాకే కనిపిస్తోంది. కమలాపురం, జమ్మలమడుగులో హోరాహోరీగా తలపడుతున్నాయి. బద్వేలులో కొంతమేర వైకాపాకే మొగ్గు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ కూడా బరిలోకి దిగడంతో మైనారిటీ ఓట్లు కొంతమేర చీలే అవకాశాలున్నాయి. కడప, ప్రొద్దుటూరులో ముస్లిం ఓటర్లు కీలకమైన స్థాయిలో ఉన్నారు. పులివెందులలో జగన్‌ గెలుపు నామమాత్రమే. కానీ మెజారిటీ తగ్గే అవకాశముంది. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ పర్యటించారు. అక్కడి ప్రజలతో చర్చించారు. రాజకీయ పరిస్థితులు, గెలుపోటములపై అభిప్రాయాన్ని సేకరించారు. కొంతమంది స్పష్టంగా చెప్పగా.. మరికొందరు నిరాకరించారు.


కడప మార్పు కోరుకుంటోంది..

కడప: కడప గడపలో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెదేపా అభ్యర్థి మాధవీరెడ్డికి ఒక్క అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నారు. వైకాపా తరఫున ఎమ్మెల్యేగా అంజాద్‌బాషా వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి బరిలో ఉన్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అభివృద్ధిని, సమస్యల్ని పట్టించుకోలేదని ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలూ పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. పెద్దదర్గా పరిధిలోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ముస్లింలు వాపోతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌ ముస్లిం ఓట్లను భారీగా చీల్చనున్నారు.

నాయకుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనేది కాదు. మంచి చేస్తారా.. లేదా అనేదే ముఖ్యం. సమస్యలున్నాయని వెళితే అంజాద్‌బాషా ఎప్పుడూ పట్టించుకున్నదే లేదు. ఇసుకను అక్రమంగా తరలించడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు తాగునీరు అందించడంపై ఏనాడూ పెట్టలేదు.

-పెద్ద దర్గా కూడలిలో ఓ ముస్లిం

గనన్న విద్యాదీవెన ఏ సంవత్సరమూ సక్రమంగా వేయలేదు. సమయానికి కట్టకపోతే కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయనీయట్లేదు. మా అమ్మానాన్నలు అప్పుచేసి తెస్తే పరీక్షకు ఒక్కరోజు ముందు నేను ఫీజు కట్టా. కచ్చితంగా ఓటు వేసేవరకూ దీన్ని గుర్తుపెట్టుకుంటా.

-చిన్నమాసుపల్లెలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థి


గెలిచేది పెద్దాయనే


 

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో తెదేపా గెలుపు నల్లేరు మీద నడకనే ప్రచారం ఉంది. ఈసారి గెలిచేది ‘పెద్దాయనే’ (వరదరాజులరెడ్డి) అని ఎక్కువమంది నోట వినిపిస్తోంది. చివరి అస్త్రంగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు డబ్బును ప్రయోగిస్తున్నారు. తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య బీసీల్లో వైకాపా పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఇక్కడ బీసీల ఓట్లు 60వేల వరకు ఉన్నాయి. రాచమల్లు అవినీతిపైనా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.  ఇసుక మాఫియా, క్రికెట్‌ బెట్టింగ్‌ అంశాలు ప్రభావం చూపనున్నాయి. బంగారు అంగళ్ల వ్యవహారం, తాత్కాలిక మార్కెట్‌లో గదుల కేటాయింపులో వసూళ్లు, బినామీ పేరుతో చర్చి భూముల కొనుగోలు కీలకం కానున్నాయి.


వైకాపాకు అంత ఈజీగా లేదు

కమలాపురం: కమలాపురంలో జగన్‌ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి వైకాపా తరఫున మూడోసారి బరిలో దిగారు. గత రెండుసార్లు గెలిచినా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదు. ఆయనకు పుత్తా చైతన్యరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరి నోట విన్నా ‘హోరాహోరీ’నే అనే మాట వినిపిస్తోంది. రవీంద్రనాథ్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభావం చూపనున్నాయి. పెండ్లిమర్రి మండలంలో భూముల ఆక్రమణ, వీరపునాయునిపల్లె మండలం చేపల చెరువులపైౖ చర్చ జరుగుతోంది.

వైకాపా గత ఎన్నికల్లో ఉన్నట్టు ఏకపక్షంగా ఏమీ లేదు. తెదేపా, వైకాపా రెండూ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఎవరు గెలిచినా 5వేల ఓట్ల మెజారిటీనే ఉంటుంది.

-పెండ్లిమర్రికి చెందిన మధ్యవయస్కుడు


తగ్గనున్న మెజారిటీ

పులివెందుల: పులివెందులలో జగన్‌ గెలుపు నామమాత్రమే. కానీ గతం కంటే ఈసారి తెదేపా పుంజుకుంది. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్‌ వివేకా హత్య కూడా ఈ ఎన్నికల్లో కీలకాంశంగా ఉంది. ఇది ప్రభావం చూపిస్తే జగన్‌ మెజారిటీ తగ్గే అవకాశముంది. సీఎంగా ఉన్న జగన్‌ను నియోజకవర్గ ప్రజలు కలవాలంటే ఎంపీ అవినాష్‌రెడ్డి అనుమతి ఉండాల్సిందే. నేరుగా కలిసే అవకాశం లేదు. ప్రజల్లో అసంతృప్తికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. గతం కంటే వైకాపాకు ఇక్కడ మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఓట్ల రూపంలో ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని పూలవ్యాపారి ఒకరు వెల్లడించారు.


ఒక్కసారి అవకాశమిద్దాం

మైదుకూరు: గత రెండు ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీచేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌పై సానుభూతిపవనాలు వీస్తున్నాయి. ఆయనకు ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈసారి గెలుపు ‘పుట్టా’దే అని స్పష్టంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుకను, మట్టినీ వదల్లేదని ప్రజలు చెబుతున్నారు. గత ఎన్నికలు జగన్‌ కేంద్రంగానే నడిచాయని, తామంతా అప్పట్లో వైకాపాకే ఓటేశామని, ఈసారి ఆ పరిస్థితి లేదని మైదుకూరు నగర పరిధిలోని 8 మంది మధ్యవయస్కులు చెప్పారు. నియోజకవర్గంలో కీలక ఓటుబ్యాంకు కలిగిన డీఎల్‌ రవీంద్రారెడ్డి తెదేపాకు మద్దతుగా నిలవడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అంశం.

త ఎన్నికల్లో వైకాపాకు ఓటేశా. ప్రభుత్వం చేసిందేమీ లేదు. పంట నష్టపోయినా బీమా ఇవ్వలేదు. కనీసం పొలాలకు మట్టినీ మిగల్చకుండా దోచుకుంటున్నారు. ఈసారి పుట్టాకు అవకాశం ఇవ్వాలనుకున్నాం.

-చాపాడులో ఓ రైతు


మస్యలు చెప్పుకొనేందుకు వెళితే రఘురామిరెడ్డి ఏనాడూ కలిసి విన్నది లేదు. సుధాకర్‌యాదవ్‌ ఎవరు వెళ్లినా ఆలకిస్తారు. నేను గత ఎన్నికల్లో వైకాపాకు ఓటేశా. గ్రామంలో అభివృద్ధి లేదు. సొంతంగా సిమెంటురోడ్డు వేసుకున్నాం. పుట్టా రెండుసార్లు ఓడిపోయారు. ఈసారి ఆయనే గెలుస్తారని అనుకుంటున్నా.

-గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన మధ్యవయస్కుడు


ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి

జమ్మలమడుగు: కడప లోక్‌సభ పరిధిలో ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో జమ్మలమడుగు ఒకటి. పొత్తులో భాగంగా ఇక్కడ భాజపా పోటీచేస్తోంది. గత ఎన్నికల్లో తెదేపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డి.. ఇప్పుడు భాజపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయన అన్న కుమారుడు భూషేశ్‌రెడ్డి ఉన్నారు. రామసుబ్బారెడ్డి తెదేపాను వీడి వైకాపాలో చేరినా, కీలక నేతలెవరూ ఆయన వెంట వెళ్లలేదు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న పని చేయాలన్నా డబ్బు ముట్టజెప్పాల్సిందే అనే చర్చ జరుగుతోంది. ఇసుక మాఫియా, భూకబ్జాలు, జమ్మలమడుగులో కిలో చికెన్‌పై రూ.10 చొప్పున వసూలు ఎన్నికల్లో కీలకంగా నిలుస్తున్నాయి. వైకాపా క్యాడర్‌లోనూ ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. చివరి అస్త్రంగా సొంతపార్టీ నాయకుల్నే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

మ్మలమడుగులో నికరంగా వైఎస్‌ కుటుంబానికి 40వేల ఓట్లున్నాయి. ఇప్పుడు అదనంగా రామసుబ్బారెడ్డి వర్గం ఓట్లు వచ్చి చేరాయి. ఇక్కడ గెలుపు వైకాపాదే. ప్రతి కుటుంబం పథకాల ద్వారా లబ్ధి పొందింది. వారు ఎందుకు ఓట్లు వేయరు?

-పెద్దదండ్లూరుకు చెందిన వైకాపా నేత

పార్టీ ఏదనేది కాదు. చెప్పినది చేస్తారనే నమ్మకం ఆదినారాయణరెడ్డిపై ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జమ్మలమడుగు అభివృద్ధి చెందింది. గత ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.

-జమ్మలమడుగులో టీ స్టాల్‌ నడుపుతున్న ఓ ముస్లిం


ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే

బద్వేలు: ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయినా, బలమైన సామాజికవర్గాలే అనుచరుల్ని దింపి రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈసారి ఇక్కడ టికెట్‌ భాజపాకు దక్కడంతో బొజ్జా రోషన్న పోటీచేస్తున్నారు. ఎన్డీయే బలమైన పోటీ ఇస్తున్నా... గెలుపు అవకాశాలు వైకాపాకే ఎక్కువగా ఉన్నాయి. తెదేపా, జనసేన, భాజపాలు కలిసి పనిచేస్తున్నాయని, గ్రామాల్లో ఎక్కడా పట్టు సడలనివ్వడం లేదని పెద్దుళ్లపల్లికి చెందిన వైకాపా నాయకుడు చెప్పారు. వ్యాపారవర్గాలు కూటమి వైపు మొగ్గుచూపుతున్నారని, ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే అని వీరారెడ్డి సర్కిల్‌లోని ఓ వ్యాపారి తెలిపారు.

న్నడూ చూడని దరిద్రాన్ని ఈ ఐదేళ్లూ అనుభవించాం. నానాకష్టాలు పడ్డాం. ఏ నాయకుడైనా... ప్రభుత్వమైనా ప్రజల్ని పీక్కుతినకూడదు. పన్నులు, కరెంటు ఛార్జీలు ఇష్టానుసారం పెంచారు. పనుల్లేవు, ఆదాయం లేదు. ఎలా బతకాలి?

-బద్వేలులో ఓ బేల్దారి ఆవేదన ఇది

త ఎన్నికల ముందు ట్రాక్టర్‌ కార్మికులందరూ కలిసి జగన్‌కు ఓటేయాలని నిర్ణయించుకుని అందరం ఓటేశాం. దానికి బాగా బుద్ధి చెప్పారు. ఇసుక ధరను పెంచి ట్రాక్టర్‌ డ్రైవర్లందరినీ రోడ్డున పడేశారు. రోజుకు రూ.200 కూడా సంపాదించుకోలేని స్థితికి తెచ్చారు. వైకాపాకు ఓటేయకూడదని అందరం నిర్ణయించుకున్నాం.

-పదిమంది ట్రాక్టర్‌ కార్మికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img