icon icon icon
icon icon icon

మార్పు దిశగా నంద్యాల తీర్పు!

నందుల కోట నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా? అధికార వైకాపా కోటలు బీటలు వారనున్నాయా? అయిదేళ్ల నుంచి ప్రభుత్వ నిరంకుశ విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అరాచకత్వం, ఆక్రమణలు, దౌర్జన్యాలు, బెదిరింపులు సామాన్యులనూ ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.

Updated : 29 Apr 2024 10:34 IST

వైకాపా దమనకాండపై రగులుతున్న పౌరులు
ఓటుతో సమాధానం చెప్పేందుకు సిద్ధం
అయిదేళ్లలో దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలే
డోన్‌లో ఆర్థిక మంత్రికి ఎదురుగాలి!
బనగానపల్లిలో కాటసాని కబ్జా కోటకు బీటలు
కలిసి నడిస్తే కూటమిదే నందికొట్కూరు
నంద్యాల, పాణ్యం, ఆళ్లగడ్డ, ఆత్మకూరులలో దూసుకెళుతున్న కూటమి అభ్యర్థులు
నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

నందుల కోట నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా? అధికార వైకాపా కోటలు బీటలు వారనున్నాయా? అయిదేళ్ల నుంచి ప్రభుత్వ నిరంకుశ విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అరాచకత్వం, ఆక్రమణలు, దౌర్జన్యాలు, బెదిరింపులు సామాన్యులనూ ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఎన్నికల్లో తగిన తీర్పునిచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. తమ అసహనాన్ని ఓట్ల రూపంలో నిక్షిప్తం చేసేందుకు దృఢమైన నిర్ణయానికి వస్తున్నారు. పాణ్యం, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించారు. ఓటర్లు కోరుకుంటున్న మేలిమార్పు ఈ పర్యటనలో కనిపించింది. మనసులోని మాటను నలుగురిలో నిర్భయంగా చెప్పేందుకు వెనకంజ వేసిన వారు.. కాస్త దూరంగా ఒక్కరుగా వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ అయిదేళ్లు తామెంతగా వెనకబడ్డామో ప్రస్తావిస్తూనే తగిన తీర్పునిస్తామని వెల్లడించారు. వారి అభిప్రాయాల ప్రకారం ఆయా నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులిలా ఉన్నాయి.


‘సండే’ ఎమ్మెల్యే.. డబ్బు వెదజల్లడంపైనే దృష్టి

నంద్యాలలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని స్థానికులు ‘సండే’ ఎమ్మెల్యేగా పిలుచుకుంటారు. ఆదివారం తప్ప మిగిలిన రోజులు వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటారు. నియోజకవర్గంలోని బలమైన రెండు సామాజికవర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని లాభసాటి చేసుకునేందుకు జనాభిప్రాయంతో సంబంధం లేకుండా కల్వకుర్తి-జమ్మలమడుగు జాతీయ రహదారి ఎలైన్‌మెంట్‌ మార్పు చేయించి రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. నగరంలో ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు తెదేపా హయాంలో అమలుచేసిన ‘అమృత్‌’ పథకంలో మిగిలిన 30 శాతం పనులనూ పూర్తి చేయించలేకపోయారు. నియోజకవర్గంలో భూకబ్జాల వంటివి ఎమ్మెల్యేకు ప్రతికూలమయ్యాయి. మధ్యలో ఒక ఉపఎన్నికలో తప్పిస్తే 2004 నుంచి శిల్పా కుటుంబం గెలుస్తుండడం, ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా రక్షిత మంచినీటి సరఫరా, శిల్పా సూపర్‌మార్కెట్‌లో పది శాతం రాయితీతో సరకుల విక్రయాలవంటి వాటితో ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలను ఆయన కొనసాగించారు. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ స్థానాలతోపాటు వారి వర్గానికి చెందిన ఇసాక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించుకున్నారు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ముస్లిం సామాజికవర్గానికి చెందిన స్థానికుడు, వివాదరహితుడు తెదేపా మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఆయన సామాజికవర్గంతోపాటు మరో బలమైన సామాజికవర్గం, బీసీ కులాలు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్యే వర్గం డబ్బుతోనే రాజకీయం చేస్తుండగా, ఫరూక్‌ తనకున్న రాజకీయ అనుభవంతో పోరాడుతున్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే వర్గం పంచే డబ్బులు ప్రభావం చూపనట్లయితే ఫరూక్‌కు సానుకూలత ఏర్పడనుంది. నగరంలో అబ్దుల్‌సలాం కుటుంబం ఆత్మహత్య ఉదంతమూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచింది.


బనగానపల్లిలో ఫ్యాన్‌కు ఎదురుగాలి

బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈసారి ఆయన సొంత మండలం అవుకులోనే మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అవుకుకు చెందిన బలమైన నేతలు చల్లా రామకృష్ణారెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి గత ఎన్నికల్లో మద్దతివ్వడం రామిరెడ్డికి కలిసి వచ్చింది. ఈ అయిదేళ్లలో బనగానపల్లిలో వంద పడకల ఆసుపత్రి, 4 వరుసల రహదారి ఏర్పాటవడం సానుకూలాంశం. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దనరెడ్డి గ్రామీణ రహదారులను నిర్మించడం, తాగునీటి సరఫరాతోపాటు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేయించడాన్ని గ్రామీణులు గుర్తు చేసుకుంటున్నారు. కాటసానికి ఉన్నట్లు బీసీ జనార్దనరెడ్డికి ఫ్యాక్షన్‌ ముద్ర లేకపోవడం కలిసి వస్తోంది. ఆయా గ్రామాల్లోని బలమైన నాయకత్వమూ ప్రస్తుతం తెదేపాలో చేరుతోంది. తన వర్గం దౌర్జన్యాలు కాటసానికి ప్రతికూలమయ్యాయి. బీసీ జనార్దనరెడ్డికి అవకాశాలు పెరిగాయి.


పాణ్యంలో కబ్జా కథ కంచికి చేరేనా?

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఏలుబడిలో పాణ్యం భూకబ్జాలకు పెట్టింది పేరుగా మారింది. గడివేముల, ఓర్వకల్లు మండలాల్లో ఎమ్మెల్యేకు ఎదురుగాలి వీస్తోంది. నియోజకవర్గంలో కీలకమైన కల్లూరు పట్టణం, గ్రామీణంలో లక్షన్నరకుపైగా ఓట్లున్నాయి. ఇక్కడి తెదేపా నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. తెదేపాలో ఇటీవల చేరిన మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కల్లూరులోనే నివసిస్తూ క్రియాశీలమవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ మళ్లీ పుంజుకుంటోంది. వ్యతిరేకతను అధిగమించేందుకు రాంభూపాల్‌రెడ్డి భారీగా ఖర్చుపెడుతున్నారు. ఈ నియోజకవర్గంలోనే పెద్దసంఖ్యలో బోగస్‌ ఓట్లను నమోదు చేయించారని వెల్లడైంది. అయితే ఇక్కడ తెదేపా కూటమి అభ్యర్థి గౌరు చరితకు మహిళగా సానుకూలత ఉంది. బైరెడ్డి, గౌరుచరితల సమష్టి కృషితోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కాటసానికి కష్టకాలం తెచ్చిపెట్టిందన్న వ్యాఖ్యలు వినిపించాయి.


నంది కొట్కూరు.. సమష్టిగా పోరాడితే తెదేపాదే!

‘వైకాపా నుంచి పోటీకి అవకాశం దక్కక కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన సిటింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్‌ చీల్చే ప్రతి ఓటూ నిర్ణయాత్మకం కానుంది. తెదేపాలోకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి పునరాగమనంతో తిరిగి ఆయన వైపు పార్టీ శ్రేణులు వెళుతున్నాయి. వైకాపా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గంలో చీలిక వచ్చింది. వైకాపా అభ్యర్థి సుధీర్‌ దారా స్థానికుడు కాకపోవడం పార్టీకి ప్రతికూలాంశం. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాడుతుండటంతో వైకాపా నామమాత్రపు మెజారిటీతోనైనా బయటపడే అవకాశం ఉందన్న చర్చ కొద్ది రోజుల వరకు నడిచింది. తాజాగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి అభ్యర్థి జయసూర్య (తెదేపా), ఎంపీ అభ్యర్థి శబరి, సీనియర్‌ నేతలు మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డిలు కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తే పరిస్థితులు మరింత సానుకూలమవుతాయి.


డోన్‌లో బుగ్గన అణచివేత రాజకీయం

డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి రణనీతికి కోట్ల జయసూర్యప్రకాశ రెడ్డి పెద్దరికం చెక్‌ పెడుతోంది. ‘అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌ జైలుకు వెళితే రాజానే ముఖ్యమంత్రి’ అని ఆయన వర్గం డోన్‌లో కొంతకాలం ప్రాభవాన్ని చాటింది. ‘నియోజకవర్గంలో రాజా గుత్తాధిపత్యం చూపారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు’ అని ఆయన దగ్గరి బంధువైన మహిళ తెలిపారు. ‘ఇన్నాళ్లూ పార్టీని ఉపయోగించుకుని ఇప్పుడు తెదేపా జెండా కప్పుకొనే వారికి తిరిగి అధికారంలోకొచ్చాక తప్పనిసరిగా గిఫ్ట్‌ ఇస్తా’ అని ఈ మధ్య బుగ్గన హెచ్చరించారు. తన బంధువులైనా సరే లొంగి ఉండకపోతే అణచివేస్తారని, స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తారని, ప్రశ్నిస్తే ఎంతటివారినైనా ఆర్థికంగా దెబ్బకొడతారని బుగ్గన గురించి స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి జయసూర్యప్రకాశ రెడ్డిని ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపాక డోన్‌, ప్యాపిలి, బేతంచెర్లలో తెదేపాలోకి వలసలు పెరిగాయి. గతంలో  కోట్ల కుటుంబం చేసిన అభివృద్ధినీ స్థానికులు గుర్తు చేస్తున్నారు. కూటమిలో జనసేన ఉన్నందున ఆ పార్టీకి సంబంధించి బలమైన సామాజికవర్గ మద్దతూ కోట్లకు లభిస్తోంది. డోన్‌ మార్కెట్‌ ఛైర్మన్‌ మూర్తయ్య, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ హరికిషన్‌, కౌన్సిలర్‌ సుబ్బలక్ష్మి, మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజేశ్‌ పెదనాన్న సప్తశైల వెంకటేశ్‌, సర్పంచులు మనోహరమ్మ, అర్జున్‌రెడ్డి తదితరులు ఇప్పటికే వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తనను మంత్రి నమ్మించి మోసం చేశారంటూ బుగ్గనకు వరుస సోదరుడు బుగ్గన ప్రభాకర్‌రెడ్డి వైకాపాను వీడారు.


ఆళ్లగడ్డలో హోరాహోరీ

ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో తెదేపా కూటమి అభ్యర్థి భూమా అఖిలప్రియ పోటీ పడుతున్నారు. చేరికలతో తెదేపా బలం పుంజుకుంటోంది. అఖిలప్రియతోపాటు ఆమె సోదరుడు విఖ్యాత్‌రెడ్డి భూమా కుటుంబ వారసుడిగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ సామాజికవర్గం ఓట్లు ఇక్కడ నిర్ణయాత్మకమవడం కలిసొచ్చే అంశం. అఖిలప్రియ పెద్దనాన్న కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి వైకాపాలో చేరడం, భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియపై యుద్ధం ప్రకటించడం వంటివన్నీ ఆమె పట్ల సానుభూతి పెంచాయి. సమస్యలపై పోరాడే తత్వం, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న తీరు అఖిలప్రియ నాయకత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. నియోజకవర్గంలో భూమా, గంగుల తర్వాత పేరున్న ఇరిగెల రాంపుల్లారెడ్డి ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలిచారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి అండ కలిసిరానుంది. ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి 2019లో 35 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచినప్పటికీ.. అదంతా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్లనేనంటూ తెదేపా జనంలోకి తీసుకెళ్లగలిగింది. ‘తెదేపా విజయావకాశాలున్నాయి. కానీ.. భూమా- గంగుల కుటుంబాల పేరుతో ఎన్నికలైతే మాత్రం క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా బలంగా ఉన్న గంగుల (వైకాపా)దే పైచేయి అయ్యే అవకాశాలున్నాయి. భూమా కుటుంబసభ్యులందరినీ ఒక్కతాటిపైకి తెస్తే అఖిలప్రియ గెలుపు తథ్యం’ అని స్థానికులు చెబుతున్నారు.


శ్రీశైలంలో చేరికలతో తెదేపా జోరు

శ్రీశైలం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ పోటీపడుతున్నారు. ఆత్మకూరులో వర్ధన్‌ బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఇది రూ.కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. దాని వెనుక ఎమ్మెల్యే ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఏర్పడింది. కేసులు పెట్టి వేధించడంతో అనేకమంది సొంత పార్టీ నేతలే బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సోదరుడి సెటిల్‌మెంట్లు, మహానంది మండలంలో ఎమ్మెల్యే అనుచరుల కబ్జాకాండ వంటివన్నీ ప్రతికూలాంశాలయ్యాయి. ఆత్మకూరులో నిర్ణయాత్మకమైన ముస్లిం ఓట్లలో వైకాపాకే గతంలో మెజారిటీ వచ్చేది. ఇప్పుడా పరిస్థితి మారింది. తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి ముస్లింలతో ఇటీవల నిర్వహించిన సమావేశం విజయవంతమవడం ప్రస్తావనార్హం. గతంలో వైకాపాకు మెజారిటీ వచ్చిన బండిఆత్మకూరు, మహానంది వంటి మండలాల్లోనూ పరిస్థితి మారింది. ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో మాత్రమే తెదేపా కూటమితో వైకాపా పోటీపడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img