icon icon icon
icon icon icon

Telangana assembly elections: మరో విజయానికి తహతహ

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇదివరకే ఒక సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి..

Updated : 21 Nov 2023 13:50 IST

గతంలో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడూ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అభ్యర్థులు
మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇదివరకే ఒక సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. మరోసారి పోరుకు సిద్ధమవుతున్న వారు 9 మంది ఉన్నారు.  

2009లో గెలిచి..

దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున 2009లో విజయం సాధించిన నేనావత్‌ బాలునాయక్‌.. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో తుంగతుర్తి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. సూర్యాపేట నుంచి 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి సూర్యాపేట నుంచి  కాంగ్రెస్‌ పక్షాన పోటీలో ఉన్నారు.

రెండోసారి విజయానికి ఆరాటం

2018లో నల్గొండ నియోజకవర్గంలో తెరాస నుంచి విజయం సాధించిన కంచర్ల భూపాల్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈయన 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇదే ఎన్నికల్లో కోదాడ నుంచి తెరాస తరఫున బరిలో నిలిచిన బొల్లం మల్లయ్యయాదవ్‌ తొలి సారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మరో సారి పోరుకు సై అంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన నలమాద పద్మావతిరెడ్డి.. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రెండో సారి ఎమ్మెల్యేగా గెలవాలని బరిలో నిలిచారు.   నకిరేకల్‌లో తెరాస అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన వేముల వీరేశం.. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. 2018లో మునుగోడు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. 2022లో తన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా తరఫున పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ పక్షాన బరిలో నిలిచారు.  

ఉప ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేసి.. నాగార్జునసాగర్‌లో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసి విజయం సాధించిన నోముల భగత్‌..2023లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యారు. హుజూర్‌నగర్‌లో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి.రెండో విజయాన్ని అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈయన 2018 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img