Telangana assembly elections: నాన్న బాట.. గెలుపు వేట

వారు తండ్రిచాటు బిడ్డలు... కొందరు అనూహ్యంగా.. మరికొందరు వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. నాన్నకు ప్రేమతో అంటూ.. ప్రజా జీవితంలోకి వచ్చారు. తండ్రుల ఆశయాల సాధనకు ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated : 21 Nov 2023 13:43 IST
ఎన్నికల బరిలో ముగ్గురు తనయలు

ఈనాడు, హైదరాబాద్‌ : వారు తండ్రిచాటు బిడ్డలు... కొందరు అనూహ్యంగా.. మరికొందరు వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. నాన్నకు ప్రేమతో అంటూ.. ప్రజా జీవితంలోకి వచ్చారు. తండ్రుల ఆశయాల సాధనకు ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు పార్టీల నుంచి తలపడుతున్నారు. గెలుపు కోసం    పరిశ్రమిస్తున్నారు.  వారే విజయారెడ్డి, లాస్యనందిత, వెన్నెల.

పేదలకు పెద్ద దిక్కునైతా..:  పి.విజయారెడ్డి

హైదరాబాద్‌ రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు సేవలందించిన ప్రజా నాయకుడు పి.జనార్దన్‌రెడ్డి. ఖైరతాబాద్‌ నుంచి ఆయన కాంగ్రెస్‌ తరఫున 1978, 1985, 1989, 1994, 2004లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేశారు. 2007లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన వారసుడిగా పి.విష్ణువర్ధన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 నుంచి పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి నాన్న రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారి ఖైరతాబాద్‌ నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు దక్కలేదు. ఆ తర్వాత ఆమె భారాసలో చేరి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరారు. ‘ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనేది పీజేఆర్‌ ఆశయమని, ఆయన అడుగుజాడల్లో నేను కూడా పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అన్నారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయడం లక్ష్యం: లాస్యనందిత

కంటోన్మెంట్‌లో పిలిస్తే పలికే నేతగా సాయన్నకు గుర్తింపు. 1994 నుంచి మధ్యలో ఒకసారి మినహా 2018 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన 2015 తర్వాత భారాసలో చేరారు. అప్పుడే కుమార్తె లాస్యనందితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమె కవాడిగూడ కార్పొరేటర్‌గా ఒకసారి గెలిచి, రెండోసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సాయన్న ఆరునెలల క్రితం అకాల మరణంతో భారాస ఈసారి టికెట్‌ లాస్యనందితకు కేటాయించింది. నాన్న బాటలోనే ఆమె నడుస్తున్నారు. ప్రజలందర్నీ కలుస్తున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అందరివాడిగా గుర్తింపు పొందిన నాన్నమాదిరే తాను నడవాలనుకుంటున్నట్లు లాస్యనందిత చెబుతున్నారు. ‘నియోజకవర్గంలో సాయన్న మొదలెట్టిన అభివృద్ధి పనులు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నందిత అన్నారు.

సేవ చేయడానికి..: డాక్టర్‌ వెన్నెల

ప్రజల్ని తన పాటలతో మేల్కొలిపిన ప్రజాగాయకుడు గద్దర్‌.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు. తన గళంతో లక్షలాది గొంతుకల్ని ఏకం చేశారు. చాలా ఏళ్లపాటు బ్యాలెట్‌ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తీరా పోటీ చేద్దామనుకునే సమయంలో ఆయనే దూరం అయ్యారు. గద్దర్‌ అకాలమరణంతో ఆయన కూతురు డాక్టర్‌ వెన్నెలకు కాంగ్రెస్‌ కంటోన్మెంట్‌ టికెట్‌ ఇచ్చింది. సమాజం కోసం నాన్న తపించిన తీరుగానే తానూ నడుస్తానంటూ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని.. తన గెలుపు ఖాయం అని వెన్నెల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని