Delhi Metro: కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు

కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్‌ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.      

Published : 10 May 2024 05:12 IST

దిల్లీ: కదులుతున్న మెట్రో (Metro Train)లోనే బాలుడిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు దిగాడు. ఈ సంఘటన దిల్లీ (Delhi)లో చోటుచేసుకుంది. గత శుక్రవారం మెట్రోలో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికుడు తనని లైంగికంగా వేధించినట్లు 16 ఏళ్ల బాలుడు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వరుస పోస్టులు పెట్టాడు. తన ప్రైవేట్‌ భాగాలను తాకడానికి సదరు వ్యక్తి ప్రయత్నించాడని, మెట్రో రైళ్లు మారే క్రమంలోనూ తనను వెంబడించాడని తెలిపాడు. దిల్లీలోని రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడు 28 ఏళ్ల జితేందర్‌ గౌతమ్‌గా గుర్తించారు అరెస్టు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన నిందితుడు.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిని పట్టుకోవడానికి ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో మెట్రో సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (మెట్రో) రామ్‌గోపాల్‌ నాయక్‌ తెలిపారు. రాజీవ్‌ చౌక్‌ నుంచి జహంగీర్‌ పురి స్టేషన్‌ల మధ్య ఉన్న 15 మెట్రో స్టేషన్‌లలోని పలు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జహంగీర్‌ పురి స్టేషన్‌లో నిందితుడు దిగిపోయినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడి ట్రావెల్‌ హిస్టరీని పరిశీలించగా, అతడు కౌశాంబి మెట్రో స్టేషన్‌లో ఎక్కినట్లు గుర్తించారు. రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు.. వాయువ్య దిల్లీలోని ఓ ప్రాంతంలో గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఎలాంటి నేరచరిత్ర లేదని, పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 355, పోక్సో సెక్షన్‌ 8 కింద కేసులు నమోదుచేసినట్లు రాజీవ్‌ చౌక్‌ మెట్రో పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని