భారత లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది.

Updated : 10 May 2024 06:32 IST

మాస్కో: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని పేర్కొంది. భారత అంతర్గత వ్యవహారాలు సహా సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా తెలిపింది. ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపర్చాలని ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు. మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) నివేదిక ఇచ్చింది. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపైనే మీడియా అడిగిన ప్రశ్నకు భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ మారియా ఆరోపించారు.

పన్నూ కేసులో సాక్ష్యాల్లేవ్‌

పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి నమ్మదగిన సాక్ష్యాలను భారత్‌కు వాషింగ్టన్‌ అందించలేదు. తగిన ఆధారాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని మారియా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని