icon icon icon
icon icon icon

Telangana Elections: కాయ్‌ రాజా.. కాయ్‌.. ఫలితాలపై జోరుగా బెట్టింగులు

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పలుచోట్ల ద్విముఖ, మరికొన్నిచోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో దాగి ఉండటంతో విజయావకాశాలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

Updated : 03 Dec 2023 07:35 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌- న్యూస్‌టుడే జడ్చర్ల గ్రామీణం : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పలుచోట్ల ద్విముఖ, మరికొన్నిచోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో దాగి ఉండటంతో విజయావకాశాలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ప్రధానంగా పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు సమాచారం. బుకీలు లేకపోయినప్పటికీ స్థానికంగా పందాలు కాస్తున్నారు. గ్రామాల్లో కొందరు ఈ బెట్టింగులకు తెరతీసినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో 500 నుంచి 2 వేల మధ్య ఓట్లతో గెలిచే అవకాశాలు ఉండటంతో అభ్యర్థుల గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన కొడంగల్‌పై బెట్టింగ్‌ల జోరు కొనసాగుతోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌, వనపర్తి నియోజకవర్గాల్లోనూ స్థానికులు కొందరు లక్షల్లో పందాలు కాస్తున్నారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో బెట్టింగ్‌లు వేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గాల్లో రూ.50వేల వరకు గెలుపుపై బెట్టింగులు కాస్తున్నారు. పక్క రాష్ట్రానికి చెందినవారు కూడా పందాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. జడ్చర్ల, దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు నడుస్తోంది. ఇక్కడ తక్కువ ఓట్లతో ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలువచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో పలువురు ఈ నియోజకవర్గాలపై బెట్టింగులకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. క్రికెట్‌ బెట్టింగ్‌లకు తలపించేలా ఈ వ్యాపారం సాగుతోంది.   క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులే ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల క్రికెట్‌ బెట్టింగ్‌ అడ్డాలనే దీనికి ఎంచుకున్నారు.

చరవాణిల ద్వారా..: గ్రామాలు, పట్టణాల్లో బెట్టింగ్‌లను వాట్సాప్‌, చరవాణిల ద్వారానే ఎక్కువగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దీన్ని వ్యాపారంగా తీసుకుని కమీషన్లు దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాలు ఏ పార్టీకి వస్తాయి? ఫలానా నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎన్ని వేల ఓట్ల మోజార్టీతో గెలుపొందుతారు? రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది? ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై జోరుగా పందాలు కాస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కొందరు జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల చాయ్‌ అడ్డాలు కేంద్రంగా ఈ పందాలు కాస్తున్నారు. కౌంటింగ్‌కు మరో రోజు గడువు ఉండటంతో ఈ బెట్టింగ్‌లకు పాల్పడే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఎన్నికల విధుల్లో ఉండటంతో వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img