icon icon icon
icon icon icon

Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్‌ కీలక పాత్ర

మధ్యప్రదేశ్‌లో భాజపా విజయం కోసం సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన కృషి వెల కట్టలేనిది. ఓ దశలో తన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నా.. ఆయన మనోధైర్యం కోల్పోలేదు. పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించి మరోసారి అధికార పీఠానికి బాటలు వేశారు.

Updated : 04 Dec 2023 08:32 IST

ఈనాడు, ప్రత్యేక విభాగం

‘సీఎం పదవిపై నిర్ణయం నాది కాదు. ఎవరి పాత్ర ఏంటన్నది పార్టీయే నిర్ణయిస్తుంది’

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

(మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ..)

ధ్యప్రదేశ్‌లో భాజపా విజయం కోసం సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన కృషి వెల కట్టలేనిది. ఓ దశలో తన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నా.. ఆయన మనోధైర్యం కోల్పోలేదు. పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించి మరోసారి అధికార పీఠానికి బాటలు వేశారు. కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉంటుందనుకున్న పోరును కాస్తా ఏకపక్షం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

అపార అనుభవం

మధ్యప్రదేశ్‌ ప్రజలు చౌహాన్‌ను ముద్దుగా  ‘మామా..’ అని పిలుస్తారు. రాజకీయాల్లో ఆయన అపార అనుభవశాలి. 2005 నుంచి సీఎంగా (2018-2020 మధ్య 15 నెలలు మినహా) కొనసాగుతున్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను దాదాపుగా పక్కన పెట్టేసినంత పనిచేసింది భాజపా అధినాయకత్వం. ఎన్నికల కోసం పార్టీ విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో చౌహాన్‌ పేరు లేనే లేదు. దాంతో ఆయన్ను ఎన్నికలకు దూరంగా ఉంచుతారని, సీఎం రేసులో లేరని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే టికెట్‌ ఖాయం చేసుకున్న ఆయన.. ప్రస్తుతం లక్షకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

విస్తృతంగా ప్రచారం

ప్రచారంలో భాగంగా చౌహాన్‌ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. దాదాపు 166 ర్యాలీల్లో పాల్గొన్నారు. భాజపా హిందూత్వ ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేకతను విజయవంతంగా అధిగమించారు.

సంక్షేమ సరాగం

సీఎంగా చౌహాన్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారికి రూ.450కే సిలిండర్‌ అందించారు. లాడ్లీ లక్ష్మీ, లాడ్లీ బహనా పథకాలు ప్రారంభించారు. వాటిద్వారా ప్రధానంగా మహిళల మద్దతు దక్కించుకున్నారు. అమ్మాయిలకు పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, కిసాన్‌ కల్యాణ్‌ యోజన తదితర హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కమలదళం అఖండ విజయం సాధించిన నేపథ్యంలో చౌహాన్‌ అయిదోసారి సీఎం అవుతారా లేదా అన్న ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img