icon icon icon
icon icon icon

Helicopter: ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్‌.. గంటకు లక్షల్లోనే!

Demand for Helicopters: ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత డిమాండ్‌ నెలకొననుంది. 

Updated : 24 Nov 2023 16:44 IST

Helicopters | ఇంటర్నెట్ డెస్క్‌: పోలింగ్‌ తేదీ దగ్గరపడేలోపు వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రచారం నిర్వహించాలి.. ఒక సభ ముగిసి జనం బయటకు వెళ్లేలోపు ఇంకో సభలో ప్రత్యక్షమవ్వాలి.. ఉన్న కొద్ది సమయంలో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను చుట్టేయాలి.. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దాదాపు అంతటా ఇదే పరిస్థితి. అధికార, ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో పాటు మధ్యలో వచ్చే జాతీయ నాయకులతోనూ ప్రచారం హోరెత్తించేందుకు అన్ని పార్టీలూ అనుసరిస్తున్న జపం ఇదీ. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఏకైక సాధనం హెలికాప్టర్‌. దీంతో వీటికి ఎన్నికల వేళ డిమాండ్ ఏర్పడింది.

తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా రాజస్థాన్‌, తెలంగాణలో పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌ను అద్దెకిచ్చే కంపెనీలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. ముంబయికి చెందిన ప్రైవేటు ఛార్టర్‌ కంపెనీ ఫ్లయింగ్‌ బర్డ్స్‌ ఏవియేషన్‌కు నాలుగు హెలికాప్టర్లు, ఆరు జెట్‌ విమానాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మరో హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది. గురుగ్రామ్‌కు చెందిన బ్లేడ్‌ ఇండియాకు సైతం డిమాండ్‌ నెలకొంది. ఇది జస్ట్‌ ఆరంభం మాత్రమేనని.. 2024 సార్వత్రిక ఎన్నికలకు అసలైన డిమాండ్‌ చూడబోతున్నమని ఫ్లయింగ్‌ బర్డ్స్‌ సీఈఓ ఆశిష్‌ కుమార్‌ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం వివిధ పార్టీలు ఇప్పటి నుంచే హెలికాప్టర్లు బుక్‌ చేసుకుంటున్నాయని తెలిపారు.

ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైమ్‌ ఫ్రీ.. బెన్‌ఫిట్స్‌ ఇవే..!

గంటకు లక్షల్లోనే..

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సగటున 70-100 హెలికాప్టర్లకు డిమాండ్‌ ఉండేది. కానీ 40 మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది హెలికాప్టర్ల డిమాండ్‌ 100-130కి పెరిగింది. అయితే కేవలం 50-60 విమానాలు మాత్రమే సమకూర్చగలుతున్నామని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో హెలికాప్టర్ల అద్దె ధరలు సైతం పెరిగాయి.

2019 ఎన్నికల సమయంలో ఒక్కో హెలికాప్టర్‌కు గంటకు అద్దె రూ.55 వేలు నుంచి రూ.1.30 లక్షల వరకు ఛార్జీ చేసేవారు. ఇప్పుడది మూణ్ణాలుగు రెట్లు పెరిగింది. హెలికాప్టర్‌ రకాన్ని బట్టి గంటకు రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పార్టీలు చెల్లిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ ఛార్జీలు, ఎయిర్‌పోర్ట్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలు, ఫ్యూయల్ ట్రాన్స్‌పోర్టేషన్‌, సిబ్బంది బస, ఆహారం వంటివి దీనికి అదనం. అంతే కాదు భద్రత దృష్ట్యా.. ట్విన్‌ ఇంజిన్‌ కలిగిన హెలికాప్టర్లకే నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయా లీజింగ్‌ సంస్థలు చెబుతున్నాయి.

దేశంలో ప్రస్తుతం 155 హెలికాప్టర్లు ఉండగా.. ప్రభుత్వరంగ సంస్థ పవన్‌ హాన్స్‌ వద్దే దాదాపు మూడో వంతు ఉన్నాయి. 36 హెలికాప్టర్లు ప్రముఖ కంపెనీల వద్ద ఉన్నాయి. మిగిలిన హెలికాప్టర్లను ఆయా కంపెనీలు లీజుకిస్తున్నాయి. ఇప్పుడే డిమాండ్‌ ఇలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ పోటీ మరింత తీవ్రం కానుంది. దీంతో ఆయా కంపెనీలు హెలికాప్టర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి బ్లేడ్‌ ఇండియా కనీసం 5 కొత్త హెలికాప్టర్లను  అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. మారుమూల ప్రాంతాలకూ సులువుగా వెళ్లేందుకు అవకాశం ఉన్న ఏకైక రవాణా సాధనం కావడంతో హెలికాప్టర్లకు ఈ స్థాయిలో డిమాండ్‌ నెలకొనడానికి కారణమని ప్రైవేట్‌ ఛార్టర్‌ కంపెనీ జెట్‌ సెట్ గో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img