icon icon icon
icon icon icon

IT Raids: అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి.

Updated : 27 Nov 2023 10:50 IST

అలంపూర్‌ పట్టణం, నారాయణపేట: జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పోలీసుల బందోబస్తుతో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. జిల్లా నోడల్‌ అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. సంపత్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య మహాలక్ష్మిని అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈక్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్న సంపత్‌..  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా దాడులు చేయడమేంటని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు.. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.

మరోవైపు నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి ముఖ్య అనుచరుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ బంగారం వ్యాపారి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ హరినారాయణ, పత్తి మిల్లు యజమాని శ్రీనివాస్‌, వ్యాపారి బన్సీలాల్‌ లాహోటి ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. తెల్లవారుజామున నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇళ్లలో నగదు దాచి ఉంచారనే సమాచారంతోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img