Aided college: విద్యార్థులపై విరిగిన లాఠీ
ఎయిడెడ్ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల ఆందోళన.. వారిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.. విద్యార్థుల ప్రతిఘటన.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆవరణ రణరంగమైంది.
ఎయిడెడ్ విలీనంపై అనంతపురంలో కళాశాల విద్యార్థుల నిరసన
తరిమికొట్టిన పోలీసులు
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద పోలీసు వాహనాన్ని అడ్డుకుంటున్న విద్యార్థులు
అనంతపురం విద్య, నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎయిడెడ్ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల ఆందోళన.. వారిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.. విద్యార్థుల ప్రతిఘటన.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆవరణ రణరంగమైంది. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులు అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ (శ్రీసాయిబాబా నేషనల్) కళాశాల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించకుండా ఎయిడెడ్‌గానే కొనసాగించాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లకుండా విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అడ్డుకున్నవారిని లాగిపడేశారు. జెండా కర్రలు తీసుకొని చితక్కొట్టారు. దీంతో కొందరు విద్యార్థులు గుంపులో నుంచి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో జయలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. విద్యార్థులు ప్రతిఘటించడంతో ఆగ్రహించిన పోలీసులు వారిని చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. విద్యార్థినులనూ పురుష కానిస్టేబుళ్లే పక్కకు నెట్టేశారు. ఎట్టకేలకు విద్యార్థిసంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషనుకు తరలించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది.
విద్యార్థిని లాక్కెళ్తున్న పోలీసులు
విద్యార్థులపై లాఠీఛార్జి చేయలేదు
అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేయలేదని జిల్లా పోలీసు కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా ఆటంకపరుస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ విద్యార్థిని గాయపడింది. ఆమెను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు’ అని ఆ ప్రకటనలో వెల్లడించింది.
గాయపడిన విద్యార్థిని
లోకేశ్ పరామర్శ
ఆందోళనలో గాయపడిన విద్యార్థులు జయలక్ష్మి, నవీన్, పవన్‌లతో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. విద్యార్థుల పెడరెక్కలు విరిచి, జీపుల్లో కుక్కి లాక్కెళ్లారని గాయపడిన జయలక్ష్మి లోకేశ్‌కు వివరించింది. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే వరకూ తెదేపా, అనుబంధ సంఘాలు విద్యార్థులకు అండగా నిలుస్తాయన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీఛార్జి చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. లాఠీఛార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. లోకేశ్ బుధవారం అనంతపురం వెళ్లి పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్ధులను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్న తెదేపా నేత నారా లోకేశ్
విద్యార్థులపై లాఠీలా?: నాదెండ్ల మనోహర్
అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝులిపించి భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రజాస్వామికమన్నారు.
చదువుల తల్లుల రక్తాన్ని కళ్లజూస్తారా?: చంద్రబాబు
‘మీ బిడ్డలు కూడా తమ విద్యాసంస్థను కాపాడుకునేందుకు ఆందోళన చేస్తే.. ఇలాగే దాడులు చేస్తారా? నిలదీసే విద్యార్ధులకు లాఠీ దెబ్బలే జవాబులా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు పోలీసుల్ని ప్రశ్నించారు. అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ‘విద్యార్ధినుల పట్ల కనీస మానవత్వం చూపకుండా.. కొంతమంది పోలీసులు రౌడీమూకల్లా మారి.. చదువుల తల్లుల రక్తం కళ్లజూడటం వారి పైశాచికత్వానికి పరాకాష్ఠ. మేనమామ అంటే బతుకు కోరేవాడు.. ఇలా బడులు, కళాశాలల్ని మూసేసేవారు, అడిగితే అరాచకంగా దాడి చేసేవారు కాదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!