కణకణలాడుతున్న కాంక్రీట్‌ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?

దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్‌ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి?

Updated : 30 May 2024 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భానుడు భగభగ మండుతున్నాడు. ఎండలు (High Temperature) ఠారెత్తిస్తున్నాయి. జూన్‌ నెలలో అడుగిడుతున్నా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు సరికాదా.. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం దేశ రాజధాని దిల్లీలో (Delhi) అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత భారీ స్థాయిలో నమోదవడం దిల్లీ చరిత్రలోనే ఇది తొలిసారి. హస్తినలోనే కాదు వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి?

సాధారణంగా మే, జూన్‌, జులై నెలల్లో దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా లాంటి మెట్రో పాలిటన్‌ నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి ‘అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌’ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆయా నగరాల్లో పరిసర ప్రాంతాలకంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఈ వ్యత్యాసం భారీగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. నగరాల్లో మాత్రం భయపెడుతున్నాయి. 

అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌

సాధారణంగా గ్రామీణప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో సౌకర్యాలు ఎక్కువ. వాటి కోసం పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వేస్తూ.. దాదాపుగా నేల మొత్తాన్ని కాంక్రీట్‌తో కప్పేస్తున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా పెద్దపెద్ద భవనాలు. సాధారణంగా నేల కొంత ఎండవేడిని తనలో ఇముడ్చుకుంటుంది. కానీ, కాంక్రీట్‌ నేల విషయంలో అలా జరగదు. మొత్తం ఉష్ణం తిరిగి వాతావరణంలోకి ఉద్గారమవుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి కూడా కొంత వేడి విడుదలవుతుంది. పట్టణాలు, నగరాల్లో వీటి సంఖ్య ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడానికి పరోక్షంగా ఇవి కూడా కారణమవుతున్నాయి.

ఎల్‌నినో ఎఫెక్ట్‌..

ఎల్‌నినో అనేది ఒక వాతావరణ పోకడ. మధ్య తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన వేడి గాలులనే ఎల్‌నినో అంటారు. ఇవి కూడా భూ ఉపరితల వాతావరణం వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఎల్‌నినో వేడి దశ కాగా.. లానినా అనే మరో పక్రియ శీతల దశ. ఎల్‌నినో తర్వాత లానినా వస్తుంది. 2-7 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఒక కాలచక్రంలా ఈ రెండు పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటాయి. గతేడాదిలో ప్రారంభమైన ఎల్‌నినో జూన్‌ చివరి వరకు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో నిత్యం రకరకాల మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. వీటికితోడు ఎల్‌నినో ప్రభావంతో వీచిన వేడిగాలుల ప్రభావం భారత్‌లోని ఉత్తర మధ్య, తూర్పు ప్రాంతాలపై పడటం వల్ల ఆయాచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

గాలిలో తేమ

వేసవికాలంలో మధ్య, వాయవ్య భారత్‌లో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వడగాల్పులు వీయడం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి. అలాగని తేమ ఎక్కువగా ఉన్నా నష్టమే. పెరిగిన ఉష్ణోగ్రతలు తేమతో చర్యలు జరపడం వల్ల మరింత ఉష్ణం జనిస్తుంది. ఉదాహరణకు సముద్రతీరం వెంబడి ఉండే ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈతరహా పరిస్థితులు కనిపిస్తాయి. సముద్రం ఒడ్డున ఉండటం వల్ల వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనికి వడగాలులు తోడవడం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతాయి. భారత్‌లోని కోస్తా, మధ్య, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణ వేసవి ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది 4 నుంచి 5 శాతం పెరిగినట్లు భారత వాతావరణశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని