Weight loss: వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు.

Published : 27 May 2024 20:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఊబకాయ సమస్య ఓ ముప్పుగా మారింది. దేశ జనాభాలో 25 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీన్నుంచి బయటపడేందుకుగానూ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మొదలు వ్యాయామం, చికిత్స వంటి ప్రయత్నాలతో కొందరు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఇటీవల కొన్ని కీలక సిఫార్సులు చేసింది. బరువు తగ్గేందుకు త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలని తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

దేశంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరగడానికి జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్‌ చేసిన ఆహారం విపరీతంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేమి వంటివి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు.

తిండి + బద్ధకం =బరువు

  • కేవలం కెలోరీలపై దృష్టిపెట్టడం కాకుండా.. సమతుల ఆహారం కోసం పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇవి ఆకలి తగ్గించి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో దోహదపడతాయి.
  • బరువు తగ్గే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వారానికి 0.5 కిలోల బరువు తగ్గడం ఎంతో సురక్షితం. తద్వారా కండరాలకు నష్టం కలగకుండా, శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుంది.
  • అధిక బరువు ఉన్నప్పటికీ శరీర కనీస అవసరాల కోసం 1000 కిలోకేలరీలు ఉన్న ఆహారం తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వ్యాయామం చేసే సమయంలో నీరసంగా కనిపించరు. విటమిన్లు, మినరల్స్‌ వంటివాటితో కూడిన ఆహారంపై దృష్టిపెట్టాలి.
  • బరువు తగ్గే క్రమంలో ముదురు రంగు కూరగాయలను ఎంచుకోవడం ఉత్తమమని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. ఆకుపచ్చని కూరగాయల్లో తక్కువ కెలోరీలతో కూడిన ప్రొటీన్లు అందుతాయి.
  • ఆహారపు ప్యాకింగ్‌ లేబుళ్లను తరచూ సరిచూసుకునే అలవాటు కూడా వెయిట్‌ మేనేజ్‌మెంట్‌లో మరో కీలక అంశం. వాటిపై ఉన్న పోషకాల మోతాదు, అదనపు కెలోరీలు, అనారోగ్య కొవ్వు, షుగర్‌ స్థాయిలకు సంబంధించి ఉన్న సమాచారం తెలుసుకోవడం అవసరం.
  • ఆరోగ్యకరమైన వంట విధానం కూడా ఒకటి. గ్రిల్లింగ్‌, స్టీమింగ్‌, బేకింగ్‌తోపాటు తక్కువ నూనెతో వేపుడు వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. అనవసరమైన కెలోరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషక విలువలను కాపాడుకోవడంలో ఈ విధానమెంతో దోహదం చేస్తుంది.
  • బరువు తగ్గేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు సరైనవే అయినప్పటికీ.. ఒక్కో వ్యక్తికి ఒక్కోవిధంగా ఇవి మారొచ్చు. ఈ నేపథ్యంలో డైటీషియన్‌ లేదా వైద్య నిపుణుల సమక్షంలో వీటిని పాటించడం ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని