‘సెల్ఫీ’ సాయంతో హృద్రోగం కనిపెట్టొచ్చా..?

ప్రస్తుతం కాలంలో సెల్ఫీ (ముఖ చిత్రం) గురించి తెలియని వారుండరు. స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం మరీ ఎక్కువై పోయిందనే చెప్పాలి...

Published : 24 Aug 2020 09:50 IST

పరిశోధనలు జరుగుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడి

ప్రస్తుతం కాలంలో సెల్ఫీ (స్వీయ చిత్రం) గురించి తెలియని వారుండరు. స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం మరీ ఎక్కువై పోయిందనే చెప్పాలి. సన్నిహితులు, స్నేహితులను ఎవరినైనా కలిసినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సహజంగానే సెల్ఫీలు దిగుతుంటాం.  అయితే ఇదే వైద్య రంగంలో నూతన విధానానికి నాంది పలుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)... ఎన్నో అద్భుత  ఆవిష్క్రణలకు వేదికగా నిలుస్తోంది. గుండె సంబంధిత వ్యాధులను అంచనా వేయడానికి సెల్ఫీలతో డేటా రూపొందేలా కృత్రిమ మేధతో అభివృద్ధి చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 

హృద్రోగ చికిత్స నిపుణుడి (కార్డియాలజిస్టు) దగ్గరకు వెళ్తే తప్పనిసరిగా గత వైద్య నివేదికలను తీసుకెళ్తాం.. రాబోయే కాలంలో రికార్డులకు బదులు మీ సెల్ఫీని ఒకటి పంపండని వైద్యులు అడిగితే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.. ఇప్పటి వరకు ఇలాంటిది వైద్య రంగానికి వింతగానే ఉండొచ్చుగాని.. భవిష్యత్తులో ఓ వ్యక్తిలోని గుండె జబ్బులను కనిపెట్టేందుకు ‘సెల్ఫీ’ అడిగే విధానమే రాబోతుందని ఓ అధ్యయనం పేర్కొంది. సాధారణ, అధిక ప్రమాదం కలిగిన ప్రజల హృద్రోగాలను గుర్తించి తదుపరి వైద్యపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ అల్గారిథం స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

‘‘ముఖ చిత్రాలను విశ్లేషించి హృద్రోగాలను గుర్తించడానికి కృత్రిమ మేధ ఉపయోగపడుతుందని నిరూపించే మొదటి పని ఇది. క్లినిక్‌లలో సొంతంగా స్క్రీనింగ్‌ చేసేందుకు, రోగుల సెల్ఫీల ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే సాధనం అభివృద్ధికి తొలి అడుగు’’ అని ప్రొఫెసర్‌ జీ జెంగ్‌ అభిప్రాయపడ్డారు. క్లినిక్‌కు రాకముందే గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి స్వీయ నివేదిక అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ జెంగ్‌ తెలిపారు. తదుపరి పరిశోధన అవసరమయ్యే రోగులను గుర్తించడానికి ఇది చౌకగా, సరళంగా, ప్రభావవంతంగా ఉండాలని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ వెబ్‌సైట్‌ అధికారిక పేజీలో జెంగ్‌ వివరించారు. ముఖ కవళికల ద్వారా హృద్రోగం ప్రమాదం ఎంత మేరకు ఉందో తెలుసుకోవచ్చు. సన్నబడటం, జుట్టు, చెవి, ముడతలు, చర్మం కింద కొవ్వు శాతం వంటి లక్షణాలను సెల్ఫీ ద్వారా గుర్తించి పరిస్థితిని అంచనా వేయవచ్చని చెప్పారు. అయితే ఇలాంటి లక్షణాలను విశ్లేషించి గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించడం కష్టతరమేనని వ్యాఖ్యానించారు. 

పరిశోధన కోసం జెంగ్ బృందం ఎనిమిది చైనా ఆసుపత్రుల నుంచి 5,796 మంది రోగులను ఎంచుకున్నారు. జులై 2017 నుంచి మార్చి 2019 మధ్య వారిపై అధ్యయనం చేశారు. రోగులందరి రక్తనాళాలను పరిశోధించడానికి కరోనరీ యాంజియోగ్రఫీ, కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్ విధానాలను వినియోగించారు. వ్యాధిగ్రస్తుల ఛాయాచిత్రాలను తీయడానికి డిజిటల్ కెమెరాలను ఉపయోగించారు. రేడియాలజిస్టులు యాంజియోగ్రామ్‌లను విశ్లేషించి రోగుల్లోని గుండె జబ్బుల స్థాయిని అంచనా వేశారు. ఈ సమాచారం సేకరణ అంతా కంప్యూటర్ అల్గారిథంకు శిక్షణ ఇవ్వడానికి, ధ్రువీకరించేందుకు వినియోగించారు. అల్గారిథం సిద్ధమైన తర్వాత  గతేడాది ఏప్రిల్-జులై మధ్య మరో 1,013 మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు.  గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసే రెండు ప్రస్తుత పద్ధతులు డైమండ్-ఫారెస్టర్ మోడల్, CAD కన్సార్టియం క్లినికల్ స్కోరు విధానాలను అల్గారిథం ప్రదర్శించిందని పరిశోధకులు గుర్తించారు. ‘రోగుల ధ్రువీకరణ సమూహంలో,  అల్గారిథం 80% కేసులలో గుండె జబ్బులను సరిగ్గా గుర్తించింది. 61% కేసులలో గుండె జబ్బులు లేవని గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు విజయం సాధించినా అల్గారిథంను ఇంకా అభివృద్ధి పరచాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. అల్గారిథం అభివృద్ధి చేసినా వ్యక్తిగత సమాచారం, ముఖ్యంగా ముఖ కవళికలకు సంబంధించిన డేటా దుర్వినియోగంపై కొన్ని ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. అధ్యయనంపై నెలకొన్న ఆందోళనలను ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలోని సహ పరిశోధకులు సంపాదకీయంలో లేవనెత్తారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో నైతికపరమైన సమస్యలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని జెంగ్‌ అంగీకరించారు. క్లినికల్‌ సాధనాలపై భవిష్యత్‌ పరిశోధనలకు అల్గారిథం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోప్యత, బీమా, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే ఈ సాంకేతికతను వినియోగించాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ జంగ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు