Anti climb paint : దొంగలకు ‘రంగు’ పడుద్ది.. తాకితే వదిలించుకోవడం చాలా కష్టమట!

ఆక్రమణదారులను అడ్డుకోవడానికి, దొంగలను గుర్తించడానికి ‘యాంటీ క్లైంబింగ్‌ పెయింట్‌’ (Anti Climbing Paint) బాగా ఉపయోగపడుతుందట. ఎల్లప్పుడూ తడిగా ఉండే ఈ రంగు (Paint) ప్రత్యేకత గురించి తెలుసుకోండి.

Published : 26 Apr 2023 14:52 IST

(Image : Enfield MPS twitter)

దొంగలను (Thief) పట్టించడంతో ‘యాంటీ క్లైంబింగ్‌ పెయింట్‌’ (Anti Climbing Paint) భలేగా పని చేస్తుంది. ఇది చూడటానికి నల్లగా.. కందెన తరహాలో ఉంటుంది. ఇందులోని ప్రత్యేకత ఏంటంటే అప్పుడే పూసిన రంగులా (Paint) ఎప్పుడూ తడిగా కన్పిస్తుంది. ఇక ఈ రంగు పూసిన ఉపరితలాన్ని ఎక్కడం కూడా అసాధ్యమని దాని తయారీదారులు చెబుతున్నారు. ఒకసారి రంగు వేస్తే ఆ ప్రదేశం సుమారు మూడేళ్ల వరకు జారుతూనే ఉంటుందట. వేడి, చల్లని వాతావరణంలోనూ ఇది సమర్థవంతంగా పని చేస్తుందని అంటున్నారు. ఈ రంగును మూడు మిల్లీ మీటర్ల మందంతో పూస్తారు. సాధారణ పెయింట్‌లానే ఇది కొంచెం నిగనిగలాడుతూ కన్పిస్తుంది. కొద్ది రోజులకు పైన రంగు ఆరిపోయినట్లు కనిపించినప్పటికీ లోపల మాత్రం తడి కొనసాగుతుంది. ఒక వేళ ఎవరైనా దానిపై పొరపాటున చేతులు పెట్టినా అది ఓ జిగురు తరహాలో అతుక్కుపోతుంది.

ఎందుకు తయారు చేశారు?

దొంగల చొరబాట్లను నివారించాలనే  ఉద్దేశంతో ‘క్యామ్రెక్స్‌ పెయింట్స్‌’ అనే సంస్థ 1960 ప్రాంతంలో ఈ మొండి రంగును అభివృద్ధి చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లోని హార్డ్‌వేర్‌ దుకాణాల్లో దీన్ని విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరైనా మీ ఇల్లు, పెరట్లోకి ప్రవేశిస్తున్నారనే అనుమానం వస్తే ఆయా ప్రదేశాల్లో పూసిన ఈ రంగు వారికి అంటుకుంటుంది. ఒక వేళ దొంగలు ప్రవేశిస్తే మాత్రం పోలీసుల సహాయంతో వారిని పట్టుకోవడం సులభతరమవుతుంది.

వినియోగంలో తేడా వస్తే కేసులే!

ఎలాంటి ఉపరితలంపై అయినా ఈ రంగును వేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇంట్లో వారు కూడా ఆ ఉపరితలాన్ని తాకి రంగును అంటించుకునే ప్రమాదం ఉంది. అలా జరిగితే చర్మం, దుస్తుల నుంచి దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. ప్రత్యేకమైన ద్రావణాలు ఉపయోగించి మాత్రమే ఆ మరకలను తొలగించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గోడెక్కిన పిల్లులు, పక్షులకు సైతం ఈ రంగు అతుక్కునే ప్రమాదం ఉంది. దీనిని భూమిపై నుంచి 2.4 మీటర్ల ఎత్తు తరువాత మాత్రమే వేయాలి. విదేశాల్లో ఈ రంగును వాడే వారంతా ‘హెచ్చరిక’ బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అలా బోర్డు పెట్టని పక్షంలో ఇంటి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. కొందరికి శిక్షలు కూడా పడ్డ ఉదంతాలున్నాయి. అందుకే రంగును వాడే వారు జాగ్రత్తలు పాటించడంలో అశ్రద్ధ కనబర్చొద్దని దాని తయారీదారులు సూచిస్తున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని