Published : 16/11/2021 16:05 IST

Health Tips: ఆరోగ్యం కావాలా? అయితే ఇలా చేయండి..

మన జీవనశైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని అంటారు నిపుణులు. తెలిసో, తెలియకో తీసుకునే ఆహార పదార్థాలు, ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తుంటాయి. అవి తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్టే అంటారు వైద్యులు. అది జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన ఈ సూచనలు పాటించాలని చెబుతున్నారు.. 


💡 సరిపోయినంత నిద్ర 

మీరెప్పుడైనా గమనించారా? సరిగా నిద్రపోకపోతే తర్వాత ఏమవుతుందో? ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. కొందరికి తల పోటు మొదలవుతుంది. కునికిపాట్లు వస్తుంటే సరిగా పని చేయలేం. ఏకాగ్రత కుదరదు. ఇవేకాదు.. తరచూ కనీసం ఆరు గంటల పాటు నిద్ర పోకుండా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా ఎక్కువే ఉంటాయంటారు వైద్య నిపుణులు. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం మన శరీరం ప్రతిరోజూ నిద్ర తర్వాత కొత్తగా ఉత్తేజితమవుతుంది. కొత్త పనులు చేయడానికి శరీరంలోని అన్ని అవయవాలు సిద్ధమవుతాయి. కానీ నిద్రలేమి కారణంగా సహజంగా సాగాల్సిన ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. అవయవాల పనితీరులో వేగం తగ్గుతుంది. అయినా ఆ అలవాటు అలాగే కొనసాగిస్తుంటే చివరికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థల్లో లోపాలు ఏర్పడతాయి.


💡 విపరీతమైన ప్రొటీన్లు

శరీరానికి పోషక పదార్థాలు అవసరమే. కానీ అత్యధిక ప్రొటీన్లు హానికారకం. ముఖ్యంగా జంతు ఉత్పత్తుల ద్వారా వచ్చే ప్రొటీన్లు అత్యంత ప్రమాదకరం. మాంసాహారం, పాల ఉత్పత్తుల్లో ఐజీఎఫ్‌1 అనే క్యాన్సర్‌ కారక హార్మోన్లు ఉంటాయి. అందుకే వీటిని ఒక పరిమితి మించి తీసుకోవద్దు. వీటికి బదులు మొక్కల నుంచి లభించే బీన్స్, క్వినోవా, చిక్కుడులాంటి ప్రొటీన్లకు ఆహారంలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.


💡 అదేపనిగా కూర్చోవడం

ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఒకేచోట గంటలకొద్దీ కూర్చోవద్దు. కుర్చీకే అతుక్కుపోయి పని చేయడం పొగ తాగే అలవాటుకన్నా ప్రమాదం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు, వక్షోజ, పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చాలా అధ్యయనాల్లో తేలింది. గంటలకొద్దీ డ్రైవింగ్‌ చేయడం కూడా ముప్పుగానే పరిణమిస్తుంది. దీన్ని నివారించాలంటే కనీసం రెండు గంటలకోసారైనా లేచి కాసేపు తిరగాలి. శరీరాన్ని కాస్త అటు ఇటూ వంచాలి.


💡 ఏకాంతం వద్దు 

మనిషి ప్రశాంతంగా గడపడానికి కాసేపు ఒంటరిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ రోజంతా ఏకాంతంగా ఉండాలి, నా దరిదాపుల్లోకి ఎవరూ రావొద్దు అనుకోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది. కరోనా పుణ్యమాని మనుషుల మధ్య ఇప్పటికే దూరం పెరిగిపోయింది. ఇది భౌతికానికి మాత్రమే పరిమితం కావాలి. రోజులో ఎక్కువసేపు ఏకాంతంగా గడిపేవాళ్లకి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి, భావోద్వేగపరంగా చికాకులూ ఏర్పడతాయి. ఈ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి కొందరు హానికరమైన వ్యసనాలకు బానిసలవుతారు. ఈ ప్రమాదం తప్పాలంటే నలుగురితో స్నేహం చేయాలి. ఇష్టపడే వ్యక్తులకు దగ్గరలో ఉండటానికి ప్రయత్నించాలి.


💡 గడప దాటండి

ఈతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విటమిన్‌ డి లోపం. ఉద్యోగం, జీవనశైలి కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల మనలోని రోగ నిరోధకశక్తి మందగిస్తుంది. ఈ ముప్పు తప్పాలంటే శరీరానికి కాసేపైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్‌ డి లోపంతో పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో కార్డియోవ్యాస్కులర్‌ డిసీజ్, మధుమేహం, క్యాన్సర్‌లాంటివి వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని