మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లఖ్‌నవూలోని ఆసుపత్రిలో చికిత్స

Updated : 21 Jul 2020 09:13 IST

లఖ్‌నవూ: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లఖ్‌నవూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కడుపులో అంతర్గత  రక్తస్రావానికి సంబంధించి గతంలో టాండన్‌కు శస్త్ర చికిత్స జరిగింది. శ్వాస ఇబ్బందులు, జ్వరంతో జూన్‌ 11న ఆసుపత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో టాండన్‌ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అశుతోష్‌ టాండన్‌ వెల్లడించారు. లఖ్‌నవూ సమీపంలో చౌక్‌నవూ గ్రామంలో జన్మించిన టాండన్‌ 20 జులై 2019న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

విద్యార్థి దశ నుంచే టాండన్‌కు ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. అనంతరం జన్‌ సంఘ్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. 1970లో కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన దశాబ్ద కాలం తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ పెద్దల సభకు ఎన్నికయ్యారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో టాండన్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. అప్పట్లో టాండన్‌ను వాజ్‌పేయి ఎన్నికల మేనేజర్‌గా వ్యవహరించేవారు. 1991 నుంచి 2003 మధ్య పలుసార్లు యూపీలో మంత్రిగా పనిచేశారు. అటల్‌ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో 2009లో లఖ్‌నవూ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలిచారు. అనంతరం 2014లో నేటి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోసం ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2018 ఆగస్టులో బిహార్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2019 జులైలో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 

టాండన్‌ మృతి పట్ల మోదీ సంతాపం..
లాల్జీ టాండన్ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేశారు. ‘‘సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా టాండన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలనలో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది’’ అని టాండన్‌ సేవల్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా టాండన్‌కు మంచి పేరుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, లఖ్‌నవూలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. అలాంటి నేత మరణం తీరని లోటని.. ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు