మా ప్రయత్నాలేవీ ఫలించలేదు:జెన్‌కో సీఎండీ

శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనలో ఎంత ప్రయత్నించినా 9 మంది చనిపోవడం బాధాకరమని తెలంగాణ జెన్‌కో సీఎండీ

Published : 24 Aug 2020 00:31 IST

హైదరాబాద్‌: శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనలో ఎంత ప్రయత్నించినా 9 మంది చనిపోవడం బాధాకరమని తెలంగాణ ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామని.. అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తామని చెప్పారు.  ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10.35 గంటలకు తనకు సమాచారం వచ్చిందని.. వెంటనే సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌ రెడ్డికి ఫోన్‌ ద్వారా తెలిపానన్నారు. రాత్రి 2.45 గంటలకు శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. అప్పటికే జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారన్నారు. 11 మంది సిబ్బంది ప్లాంట్‌ నుంచి బయటకు వచ్చారని.. లోపల 9 మంది ఉన్నట్లు తమకు తెలిసిందని ప్రభాకర్‌రావు వివరించారు. 
‘‘ఆరో యూనిట్‌ ప్యానెల్‌ బోర్డులో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ట్రిప్‌ చేయాలని ప్రయత్నించినా కాలేదు. ఆలోపు మిగతా యూనిట్లలో వైబ్రేషన్లు మొదలయ్యాయి. ఇంజినీర్లు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. నీళ్లు యూనిట్‌ లోనికి వస్తే మొత్తం మునిగిపోయేది. ఇంజినీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్లాంటును సురక్షితంగా ఉంచారు. చివరి నిమిషం వరకు ఇంజినీర్లను కాపాడడానికి ప్రయత్నించాం. అపస్మారక స్థితిలోకి వెళ్తే రక్షించడానికి అంబులెన్సులు సిద్ధం చేశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మేం కూడా లోనికి వెళ్లేందుకు మూడుసార్లు ప్రయత్నించాం. వ్యవస్థ విఫలమవడానికి కారణాలపై కమిటీ ఏర్పాటు చేశాం. ఘటనపై అంతర్గత విచారణ కూడా జరుపుతున్నాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిపుణుల కమిటీ వేస్తాం’’ అని ప్రభాకర్‌రావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని