తెలుగు రాష్ట్రాల్లో భారత్‌బంద్‌

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతులు నిరసన

Updated : 08 Dec 2022 12:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతులు నిరసన ఇవాళ దేశమంతటికీ వ్యాపించింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలకు భారీగా మద్దతు లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు,వివిధ వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వివిధ రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి.

విజయవాడలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్నదృశ్యం

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్ష నేతలు నిరసన తెలుపుతున్నారు. బస్టాండ్‌ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు, ఇతర నేతలు బైఠాయించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ విజయవాడలో బస్సులను నిలిపేయనున్నారు. గుంటూరు జిల్లాలోనూ బంద్‌కు మద్దతు లభిస్తోంది. 1200కు పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలను నిరసనకారులు అడ్డుకుంటున్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాయి.

విజయవాడ అర్టీసీ డిపోలోనే నిలిచిన బస్సులు

తెలంగాణలో తెరాసతోపాటు కాంగ్రెస్‌, తెదేపా, వామపక్షాలు బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి. హైదరాబాద్‌లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ఎదుట తెరాస,కాంగ్రెస్‌,వామపక్షాల నేతలు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. హకీంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మేడ్చల్‌ డిపోలో 186 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

* రైతుల దీక్షకు మద్దతుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. బంద్‌ నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ జాతీయ రహదారిపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
* విశాఖపట్నంలోని మద్దెలపాలెంలో భారత్‌బంద్‌లో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 

కాకినాడలో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండీ..

భారత్‌ బంద్‌కు 24 పార్టీల మద్దతు
బంద్‌కు రాష్ట్రంలోనూ బాసట



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని