Cm Jagan: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.20లక్షల చొప్పున నిధులు: సీఎం జగన్‌

డిసెంబరు నాటికి జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, సహా 1.5 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 5 లక్షల ఇళ్లు

Updated : 29 Sep 2022 21:21 IST

అమరావతి: డిసెంబరు నాటికి జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, సహా 1.5 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 5 లక్షల ఇళ్లు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. స్పందనపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోన్న తీరు సహా సమస్యల పరిష్కారంపై సీఎం చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించామన్న సీఎం.. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎలాంటి ఆలస్యానికి, అలసత్వానికి తావుండకూడదన్నారు. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అందరూ నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలని సీఎం నిర్దేశించారు. ఎమ్మెల్యే గ్రామ, మండల స్థాయి సిబ్బందితో కలిసి కనీసం రెండు రోజులపాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో ఉండాలన్నారు.

గృహ నిర్మాణంపై సమీక్ష..

గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 4,500 గ్రామ సచివాలయాలకు డిసెంబరులోగా కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం అందుతుందన్న సీఎం.. అక్కడ డిజిటల్‌ లైబ్రరీలను పూర్తిచేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణంపై సమీక్షించిన సీఎం.. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహనిర్మాణం బాగుందన్నారు. సత్యసాయి జిల్లా, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు వెనుకంజలో ఉన్నాయని, ఇక్కడ మరింత దృష్టి పెట్టాలన్నారు. విశాఖపట్నంలో 1.24లక్షల ఇళ్లు కేటాయించామని, అక్టోబరు నాటికి  పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబరు 21 నాటికి 5లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5లక్షలు, 1.5లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలన్నారు. ఇళ్లు పూర్తయ్యే నాటికి విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ సదుపాయలు తప్పనిసరిగా కల్పించాలన్నారు.

అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత నిధులు..

ఎస్‌డీజీ లక్ష్యాలపైన కలెక్టర్లు క్రమం తప్పకుండా  పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. డేటాను సక్రమంగా అప్‌లోడ్‌ చేయాలని, అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయన్నారు. ఎస్‌డీజీల ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. కలెక్టర్ల పనితీరు, సమర్థత ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తామన్నారు. దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్‌ 14400 పోస్టర్‌ అందరికీ కనిపించేలా పెద్ద సైజులో ఉండాలని, ఈ పోస్టర్‌ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని బాధ్యుడ్ని చేయాలని సీఎం ఆదేశించారు. రైతు భరోసా రెండో విడత నిధులు అక్టోబరు 26న అదే రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్నారు. వసతి దీవెన నవంబర్‌ 10న విడుదల చేస్తామని సీఎం తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని