Telangana News: వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలి: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా ఖాళీల సమగ్ర వివరాలు, రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ తదితర సమాచారాన్ని వీలైనంత త్వరగా ఆర్థికశాఖకు అందించాలని

Updated : 18 Mar 2022 13:16 IST

హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా ఖాళీల సమగ్ర వివరాలు, రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ తదితర సమాచారాన్ని వీలైనంత త్వరగా ఆర్థికశాఖకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియ సన్నాహకాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, నియామక బోర్డుల ఛైర్మన్‌లతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌, విద్య, వైద్యశాఖ కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రిజ్వీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. 

పబ్లిక్ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి కూడా సమావేశంలో పాల్గొన్నారు. 80వేల పై చిలుకు పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని, అందుకు అనుగుణంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఖాళీల సమగ్ర సమాచారం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ తదితరాలను ఖచ్చితంగా నిర్ధారించి ఆర్థికశాఖకు అందించాలని ఆదేశించారు. ఖాళీలతో పాటు రిజర్వేషన్లు, రోస్టర్‌, లోకల్‌ తదితరాలకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఆయాశాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో అన్ని అంశాలను సరిచూసుకొని నిర్ధారించుకున్న తర్వాత నియామకాలకు ఆయా నియామక సంస్థలకు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని